ఊబ‌ర్ ఎందుకు ఊబిలో కూరుకుపోయిందంటే...

ఊబ‌ర్ ఎందుకు ఊబిలో కూరుకుపోయిందంటే...

ఊబ‌ర్‌...ప్రపంచంలో ఆగమేఘాల మీద అభివృద్ధిలోదూకుడుగా ముందుకు సాగుతున్న అంకుర కంపెనీ. అయితే వివాదాలతో ఉబర్‌కున్న పేరు మసకబారింది. సమస్యల సుడిగండంలో చిక్కుకుని గిలగిలలాడుతున్న ఉబర్‌కు కొత్త జీవం పోసేందుకు భారీ ప్రణాళిక అమలు జరుగుతున్న వేళ వ్యవస్థాపకుడు, సీఈవో వైదొలగడం కీలక పరిణామం. విశిష్ట అంకుర కంపెనీకి నారుపోసి నీరుపోసి పెంచిన ట్రావిస్ కలానిక్ ఆ కంపెనీ సంక్షేమం కోసమే పక్కకు జరుగడం వైపరీత్యంగా కనిపించవచ్చు. కానీ ఇన్వెస్టర్లు గట్టిగా పట్టుబట్టడంతో ఆయన ఇంటిదారి పట్టక తప్పలేదు. తల్లిని కోల్పోయిన దుఃఖం ఒకవైపు, కంపెనీని చుట్టుముట్టిన సమస్యలు ఇంకోవైపు.. వెరసి అంకుర కంపెనీల ధృవతారగా వెలుగొందిన కలానిక్ అప్రతిష్ఠాకరమైన పరిస్థితుల్లో సారథ్యాన్ని వదిలేశారు.

ఒక చిన్న ఐడియా ప్రపంచాన్ని మార్చేస్తుంది అన్న నానుడిని అక్షరాలా నిజం చేసిన అంకుర కంపెనీ ఉబర్. యాప్ ఆధారిత క్యాబ్ కంపెనీకి మారుపేరుగా నిలిచింది. కొద్దిమందితో, పిడికెడు పెట్టుబడితో మొదలై ఎనిమిదేళ్లలో 7000 కోట్ల డాలర్ల (భారతీయ కరెన్సీలో రూ.4.76 లక్షల కోట్లు) కంపెనీగా ఎదిగి చరిత్ర సృష్టించింది. సొంతంగా ఒక్క క్యాబ్ కూడా లేకుండా క్యాబ్‌ల రంగంలో విశ్వకంపెనీగా అవతరించింది. 76 దేశాల్లో కోట్లమందికి సేవలందించింది. లక్షల మందికి ఉపాధిని సమకూర్చింది.  కలానిక్ పుట్టింది లాస్ ఏంజెల్స్‌లో. చదివింది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ క్యాంపస్‌లో. ఇంజినీరింగ్ చదువు మధ్యలో ఆపేసి వ్యాపారంలోకి దిగారు. 1998లో మొదలుపెట్టిన మొదటి స్టార్టప్ తుస్సుమంది. రెండోది 2007లో లాభానికి అమ్మేశారు. గారెట్ క్యాంప్ అనే మిత్రుడు ట్యాక్సీలను పట్టుకోవడంలో ఇబ్బందుల గురించి చెప్తే యాప్ ఐడియా వచ్చింది. ఇద్దరూ కలిసి 2010లో ఉబర్ క్యాబ్ కంపెనీ స్థాపించారు. తర్వాత న్యాయపరమైన చిక్కుల కారణంగా క్యాబ్ తొలగి, ఉత్త ఉబర్ మిగిలింది. ఆ ఏడాది చివరనే కలానిక్ సీఈవో బాధ్యతలు చేపట్టారు. అమెరికాలోని ట్యాక్సీ కంపెనీల గుత్తాధిపత్యంపై ప్రచారం చేపట్టి కలానిక్ తన క్యాబ్ సామ్రాజ్యానికి పునాదులు వేసుకున్నారు. వ్యాపారంతోపాటే వివాదాలు పెచ్చరిల్లాయి. అనేక నగరాల్లో నిషేధాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ క్ర‌మంలో స్మార్ట్‌ఫోన్ల రాక, మధ్యతరగతి సంపద వృద్ధి ఉబర్‌కు కలిసివచ్చింది. ఫోన్‌లో క్లిక్ చేస్తే చాలు క్యాబ్ మీ ముంగిట సిద్ధం అనేది నినాదంగా మారింది. అనుసంధాన వ్యాపారం ఇంటింటి మాటగా మారింది. ఉబర్ కూడా కొత్తకొత్త రంగాలకు విస్తరించింది. యాప్ ద్వారా హెలికాప్టర్ రప్పించుకోవడం మొదలుకుని ఆర్డరు చేస్తే కుక్క పిల్ల సరఫరా వంటి కొత్తరకం సేవలను ప్రవేశపెట్టింది. కలానిక్ డోన్ట్‌కేర్ తరహా వైఖరి కంపెనీ సక్సెస్‌కు దోహదం చేసింది. అయితే డ్రైవర్ల ఫిర్యాదులు, సమ్మెలు, గొడవలు ఉబర్‌ను వెంటాడటం మొదలైంది.

ఇవన్నీ ఒకెత్తు.. మహిళలకు ఉబర్ కంపెనీలో తగిన రక్షణ లేదని వచ్చిన ఆరోపణలు ఒకెత్తు. కంపెనీ సంపద తారాస్థాయికి చేరుకున్న 2017 సంవత్సరంలో వివాదాల సెగ కూడా ఎక్కువైంది. కంపెనీలో లైంగిక వేధింపుల గురించి ఉబర్ మాజీ ఇంజినీరు సూజన్ ఫోలర్ బయటపెట్టడంతో పరువు గంగలో కలిసిపోయింది. ఒక్కొక్కరుగా సంస్థ అధికారులు రాజీనామా చేస్తూ పోయారు. అమెరికా న్యాయశాఖ కంపెనీ వాడే సాఫ్ట్‌వేర్‌పై దర్యాప్తు మొదలుపెట్టింది. రోజురోజకూ ఉబర్ పతనం దిశగా ప్రయాణిస్తుండడంతో ఇన్వెస్టర్లు ఇక చాలు అని చెప్పేశారు. దీంతో క‌లానిక్ ప‌ద‌వి నుంచి వైదొలిగారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు