సొంత త‌మ్ముడినే దెబ్బ‌కొట్టాడు

సొంత త‌మ్ముడినే దెబ్బ‌కొట్టాడు

రిలయన్స్  దిగ్గ‌జాలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు వ్యాపార ప‌రంగా విడిపోయిన‌ప్ప‌టికీ అనిల్ అంబానీపై అగ్ర‌జుడైన ముఖేష్ ఎఫెక్ట్ బాగానే ప‌డిందంటున్నారు. ముఖేష్ మాన‌స‌పుత్రిక అయిన జియో దెబ్బకు అప్పటి వరకూ ఓ వెలుగువెలిగిన టెలికాం దిగ్గజాలు నష్టాలు చవిచూడాల్చి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి కంపెనీలన్నీ వినియోగదారులు జారిపోకుండా ఉండేందుకు గత్యంతరం లేక అన్‌లిమిటెడ్ ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అయితే ముఖేష్ అంబానీ ప్రవేశపెట్టిన జియో ప్రభావం అనిల్ అంబానీపై కూడా పడిందట.

అనిల్ అంబానీ సారథ్యంలో నడుస్తున్న ఆర్ కామ్ కూడా టెలికాం రంగంలో కుదేలయిన ఆపరేటర్ల జాబితాలో చేరింది. దీంతో ఇతర కంపెనీలను విలీనం చేసుకోవాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్ భావిస్తోంది. ఎయిర్‌‌సెల్‌ను విలీనం చేసుకోనున్నట్లు అనిల్ అంబానీ ఇప్పటికే ప్రకటించారు.

అయితే రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ మార్చి 31తో ముగియనుంది. జియో కూడా టారిఫ్ చార్జీలు విధిస్తే నష్టాల్లోంచి కోలుకోవచ్చని అనిల్ అంబానీ భావిస్తున్నారు. అయినా కస్టమర్లు ఎక్కడ చేజారిపోతారోనని హోలీ ఆఫర్ అంటూ ఓ చౌకైన డేటా ప్లాన్‌కు తెరలేపారు. 49 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే 1జీబీ డేటా నెల రోజుల వ్యాలిడిటీతో లభిస్తుందని రిలయన్స్ ప్రకటించింది. ఇక మౌనంగా ఉంటే లాభం లేదని, కస్టమర్లను ఆకట్టుకోవాలంటే మరిన్ని ఆఫర్లు అందుబాటులోకి తేవాలని అనిల్ అంబానీ భావిస్తున్నారని టెలికాం నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ప్రత్యర్థి కంపెనీలపై ముఖేష్ అంబానీ విసిరిన బాణం అనిల్ అంబానీని కూడా గాయపరిచిందని అంటున్నారు.

మ‌రోవైపు టెలికాం రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రిలయన్స్ జియో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌తో ఓ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్‌తో కలిసి పనిచేసి జియో సరికొత్త 4జీ ఫోన్‌ను అందించనుంది. ఈ సంవత్సరాంతానికి ఈ ఫోన్లను అందుబాటులోకి తేవాలని జియో భావిస్తోంది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు.

2వేల రూపాయల్లో ఈ గూగుల్, జియో తయారుచేసే ఫోన్లు అమ్మొచ్చని అంచనా. అంతేకాదు ఈ రెండు సంస్థలు కలిసి టెల్‌కో స్మార్ట్ టీవీ సర్వీసులను కూడా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే పలు చైనా ఫోన్ కంపెనీలతో జియో ఒప్పందాలు కుదుర్చుకుంది. కొన్ని ఫోన్లను కూడా మార్కెట్లోకి తెచ్చింది. లావా ఇంటర్నేషనల్, మరికొన్ని కంపెనీలతో కలిసి జియో 4జీ వీఓఎల్టీఈ ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్లను వెయ్యి రూపాయలకే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అంతేకాదు, ఇటీవలే చైనీస్, తైవానీస్ కంపెనీ ఒరిజినల్ డివైస్ మ్యాన్యుఫ్యాక్చర్స్‌తో తమ 4జీ ఫోన్లను తయారుచేయాలని జియో కోరింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు