అసాధ్యాన్ని బీజేపీ ఎలా సాధ్యం చేసిందంటే....

అసాధ్యాన్ని బీజేపీ ఎలా సాధ్యం చేసిందంటే....

ప్ర‌స్తుతం జ‌రిగినవి పేరుకు ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లే అయినా.. అంద‌రి క‌ళ్లూ దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌పైనే. బీజేపీ కూడా ఈ రాష్ట్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. బీజేపీ అనే కంటే ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ, పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షా అంటే స‌రిగ్గా స‌రిపోతుందేమో. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ యూపీలో పాగా వేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. 2014 ఎన్నిక‌ల్లో మొత్తం 80 ఎంపీ సీట్ల‌లో అనూహ్యంగా 73 గెలిచిన బీజేపీ.. ఇప్పుడు కూడా అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ భారీగా సీట్లు సొంతం చేసుకుంది. ఆ త‌ర్వాతే గుజ‌రాత్‌లో హోంశాఖ స‌హాయ‌మంత్రిగా ఉన్న అమిత్‌షా.. ఏకంగా బీజేపీ అధ్య‌క్ష పీఠాన్ని అధిరోహించారు. అప్ప‌టి నుంచే యూపీలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు ప్ర‌ణాళిక‌లు రచించ‌డం మొద‌లుపెట్టింది బీజేపీ. ఈ ప్లాన్‌లో వ్యూహ‌క‌ర్త ప్ర‌ధాని మోడీ అయితే.... కార్య‌క్షేత్రంలో దూకి విజ‌యం సాధించేలా చేసింది అమిత్ షా.

సాధార‌ణ ఎన్నిక‌ల్లో 42 శాతం ఓట్లు వ‌చ్చినా.. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే ఇంకా ఎక్కువే కావాల‌న్న ల‌క్ష్యంతో అమిత్ షా ప‌నిచేశారు. రాష్ట్రంలో 40 శాతం ఉన్న ఓబీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఫూల్‌పూర్ ఎంపీ కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య‌ను గతేడాది ఏప్రిల్ 8న పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మించారు. ఆయ‌న‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయ‌ని తెలిసినా.. షా మాత్రం ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఉంచారు. దీనివ‌ల్ల తూర్పు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అధికంగా ఉన్న కుశ్‌వాహా సామాజిక‌వ‌ర్గం బీజేపీ వెంట ఉంటుంద‌ని షా గ‌ట్టిగా న‌మ్మారు. ఇక 2015లో తొలిసారి ఓబీసీ సెల్‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసింది బీజేపీ. దానికి ఎస్పీ భాగ‌ల్‌ను అధ్య‌క్షుడిగా నియ‌మించింది. టికెట్ల పంప‌కంలో యాద‌వ్‌లు కాని ఓబీసీల‌కు 140 సీట్లు కేటాయించారు అమిత్ షా. స‌మాజ్‌వాదీ పార్టీని దెబ్బ‌కొట్ట‌డానికి వేసిన ప్లాన్ ఇది. ఇక మాయావ‌తి కోసం మ‌రో ప్లాన్ వేశారు షా. మాయావ‌తి జాత‌వ్ ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన వారు. దీంతో అమిత్ షా.. జాత‌వ్ కాని ద‌ళితుల‌పై దృష్టి సారించారు. 83 స్థానాల్లో నాన్ జాత‌వ్ ద‌ళితుల‌ది ఆధిపత్యం. దీంతో నాన్ జాత‌వ్ ద‌ళితుల‌కు 70 సీట్లు కేటాయించారు. యూపీ జ‌నాభాలో నాలుగు శాతం, ద‌ళితుల్లో రెండో అత్య‌ధిక జ‌నాభా ఉన్న పాసి సామాజిక వ‌ర్గాన్ని షా ఆక‌ర్షించారు. ఇక ఎన్నిక‌ల్లో కుల స‌మీక‌ర‌ణాలు ఎక్కువ‌గా ఉండే యూపీలో సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో ప్ర‌క‌టించ‌కుండా బీజేపీ వేసిన ఎత్తుగ‌డ ఫ‌లించింది.

అంతేకాదు వివిధ స్థాయిల్లో షా కుదుర్చుకున్న పొత్తులు ప‌నిచేశాయ‌ని బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అప్నాద‌ల్ ఎంపీ అనుప్రియా ప‌టేల్‌కు కేంద్ర కేబినెట్‌లో చోటు క‌ల్పించ‌డం వెనుక యూపీలోని కుల స‌మీక‌ర‌ణాలే కార‌ణ‌మ‌ని ఆ పార్టీ చెప్పింది. ఇక పూర్వాంచల్‌లో ప‌ట్టు ఉన్న భార‌తీయ స‌మాజ్ పార్టీ చీఫ్ ఓంప్ర‌కాశ్ రాజ్‌భ‌ర్‌తో చేతులు క‌లిపారు. దీనిద్వారా 40 నుంచి 50 సీట్ల‌లో బీజేపీకి ప‌ట్టు దొరికింది. ఇక 2016లో యువ టౌన్ హాల్ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా 156 ప్రాంతాల్లో ఉన్న 74 వేల మందికిపైగా యువ‌త‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు అమిత్ షా. మేనిఫెస్టో త‌యారీకి ఇది బాగా పనికొచ్చింది. లోక్ సంక‌ల్ప్ పాత్ర అంటూ ఓ డాక్యుమెంట్‌ను వాట్సాప్‌, ట్విట్ట‌ర్ ద్వారా 40 ల‌క్ష‌ల మంది అభిప్రాయాలు తీసుకొని త‌యారుచేయ‌డం విశేషం. దీనిద్వారానే బీజేపీ త‌న మేనేఫెస్టోలో రైతు రుణ‌మాఫీ, మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌లాంటి కీల‌క అంశాల‌ను ప్ర‌ముఖంగా చేర్చింది.

అదే స‌మ‌యంలో త‌ర‌చూ యువ స‌మ్మేళ‌న్‌, మ‌హిళా స‌మ్మేళ‌న్ అంటూ యువ‌త‌, మ‌హిళ‌ల‌ను ఆక‌ర్షించేలా బీజేపీ ప్ర‌చార వ్యూహాలు ర‌చించిన‌ట్లు పార్టీ వ్యూహ‌క‌ర్త‌లు వెల్ల‌డించారు. ఇక నోట్ల ర‌ద్దు ద్వారా అసంతృప్తిగా ఉన్న వ్యాపార‌వేత్త‌ల‌ను బుజ్జ‌గించేందుకు వారితో 14 కార్య‌క్ర‌మాల‌ను బీజేపీ నిర్వ‌హించింది. ఇక ప‌రివ‌ర్త‌న్ యాత్ర అంటూ యూపీ న‌లుమూల‌ల నుంచి బీజేపీ మొద‌లుపెట్టిన ప్ర‌చారం.. రాష్ట్రంలో 8 వేల కిలోమీట‌ర్లు సాగింది. ఇందులో భాగంగా 50 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌ను క‌లిసే అవ‌కాశం ద‌క్కింది. తాను పార్టీ అధ్య‌క్ష పీఠాన్ని అధీష్టించిన‌ప్ప‌టి నుంచీ యూపీలో స‌భ్య‌త్వ న‌మోదును ఓ ఉద్య‌మంలా సాగించారు అమిత్ షా. ఏడాది కాలంలోనే కోటి 80 ల‌క్ష‌ల ప్రాథ‌మిక స‌భ్య‌త్వాలు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. దీనికోసం జిల్లా, మండ‌ల స్థాయిల్లో 75 వేల మంది కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఏర్పాటుచేశారు. ఇక బూత్ మేనేజ్‌మెంట్ కోసం కూడా పెద్ద స్కెచ్చే వేసింది బీజేపీ. రాష్ట్రంలోని మొత్తం ల‌క్షా 47 వేల 401 బూత్స్‌లో క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. ఒక్కో క‌మిటీలో ప‌ది నుంచి 21 మంది స‌భ్యుల‌ను నియ‌మించింది. ఇక చివ‌రి ద‌శ పోలింగ్‌కు ముందు త‌న నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలో ఉద్ధృతంగా ప్ర‌చారం చేయాల‌ని ప్ర‌ధాని మోదీ నిర్ణ‌యించ‌డం పార్టీకి బాగా క‌లిసొచ్చింది. ప్ర‌ధాని నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క స్థానం కూడా కోల్పోకూడ‌ద‌న్న‌ది బీజేపీ వ్యూహం. ఇందులో మోదీ విజ‌య‌వంత‌మ‌య్యారు.

అటు నోట్ల ర‌ద్దు త‌ర్వాత బ్రాండ్ మోదీ ప‌డిపోతుంద‌ని, యూపీ ఎన్నిక‌లే దానికి రెఫ‌రెండ‌మ్ అని ప్ర‌త్య‌ర్థులు భావించారు. కానీ అదే బ్రాండ్ మోదీ బీజేపీకి ప్ల‌స్ అయింది. 2014 సాధార‌ణ ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రో అతిపెద్ద విజ‌యాన్ని బీజేపీకి క‌ట్ట‌బెట్టారు మోదీ. కేంద్రంలో ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన జ‌న‌రంజ‌క ప‌థ‌కాలు త‌మ‌కు విజ‌యాన్ని సాధించిపెట్టాయ‌ని బీజేపీ బలంగా న‌మ్ముతున్న‌ది. యూపీలో ఎన్డీయే ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల ల‌బ్ధిదారులు భారీగా ఉన్నారు. ఉజ్వ‌ల ప‌థ‌కానికి 52 ల‌క్ష‌లు, అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న కింద 4 ల‌క్ష‌లు, జ‌న్‌ధ‌న్ అకౌంట్లు 3 కోట్లు ఉన్నాయి. ఇక ముద్రా యోజ‌న కింద 20 వేల కోట్ల రుణాలు యూపీలో పంపిణీ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు