ప‌వ‌న్ పై పంచ్‌లేశారు

ప‌వ‌న్ పై పంచ్‌లేశారు

టాలీవుడ్ అగ్ర‌న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌ముఖ సినీ నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ కాసేప‌టి క్రితం ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాలంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో బ‌హిరంగ స‌భ‌లు ఏర్పాటు చేశారు. కేంద్ర,  రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరును ఎండ‌గ‌ట్టిన  ప‌వ‌న్ క‌ల్యాణ్... ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేన‌ని డిమాండ్ చేసిన విష‌యం  తెలిసిందే. అయితే ఎప్పుడు ప్ర‌త్యేక హోదాపై మాట్లాడినా... ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, సీఎం చంద్ర‌బాబుల‌ను వ‌దిలేస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్... కేవ‌లం బీజేపీ, టీడీపీ నేత‌ల‌ను ముఖ్యంగా వెంక‌య్య‌నాయుడు లాంటి నేత‌ల‌ను టార్గెట్ చేశారు. మోదీ, చంద్ర‌బాబు పేర్ల‌ను ప‌లికేందుకు కూడా ప‌వ‌న్ సాహ‌సించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలో ప‌వ‌న్ వైఖ‌రిపై త‌న‌దైన శైలిలో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ కాస్తంత సూటిగానే ప‌వ‌న్ పై పంచ్‌లేశారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోస‌మే ఉద్య‌మం చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం దానిపై రాజీ ప‌డిన‌ట్లుగా ఉన్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌త్యేక హోదాపై ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తున్నాయ‌ని కూడా త‌మ్మారెడ్డి అన్నారు. అయినా ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డం మాని... హోదాపై కేంద్రం క్లారిటీ ఇవ్వాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అడ‌గ‌డ‌మేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

 ఇక త‌మ్మారెడ్డి వ్యాఖ్య‌ల విష‌యానికి వ‌స్తే... *ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక హోదాపై రాజీ ప‌డిన‌ట్టున్నారు. ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేయ‌కుండా క్లారిటీ కావాలంటూ ప‌వ‌న్ చేస్తున్న వ్యాఖ్య‌లు అనుమానాల‌కు తావిస్తున్నాయి. ప్ర‌త్యేక హోదా ఇచ్చేది లేద‌ని కేంద్రం తెగేసి చెప్పాక ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇంకేం క్లారిటీ కావాలో తెలియ‌డం లేదు. మోదీని, బాబును వ‌దిలి కేంద్ర‌, రాష్ట్ర మంత్రుల‌ను తిడితే... ప్ర‌త్యేక హోదా వ‌స్తుందా?  మోదీ, చంద్ర‌బాబుల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌ట్టిగ‌గా నిల‌దీయ‌క‌పోవ‌డం అనుమానం క‌లిగిస్తోంది* అని త‌మ్మారెడ్డ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎలా స్పందిస్తార‌న్న విష‌యంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు