180 రోజులు.. నోటు పాట్లు

180 రోజులు.. నోటు పాట్లు

ముందుంది మంచి కాలం.. అంటే ఏంటో అనుకున్నారు జనం.. కానీ ఇప్పుడు తెలుస్తోంది. ముందుంది ముంచే కాలం అని. నోట్ల దెబ్బకు విలవిల్లాడుతున్న జనానికి ప్రభుత్వం తెర వెనుక చేస్తున్న మంత్రాంగం తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. నోటు కష్టాలు యాభై రోజులే అని మోడీ చెప్పారు. కానీ అసలు నిజం వేరే ఉంది.
        
కేంద్రం ప్లాన్ ప్రకారం పూర్తిస్థాయిలో 500 నోట్లు అమల్లోకి వచ్చి, నోటు కష్టాలు తీరడానికి ఆరు నెలలు పడుతుంది. 2017 జూన్.. ఇదీ కేంద్రం విధించుకున్న డెడ్ లైన్. మరి ఎక్స్ ట్రా షిఫ్టుల్లో ప్రింటింగ్ జరుగుతోంది. నగదు కొరతలేదు. ప్రజలకు సదా సేవ చేస్తున్నాం. అని చెప్పే మాటలన్నీ బూటకమేనా. అంటే వ్యూహాత్మకం అనుకోవాలి.
         
జనాన్ని ఎలాగైనా డిజిటల్ దారిలోకి మళ్లించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం బలవంతంగా ట్రై చేయడానికే నోట్ల సమస్య ఉద్దేశపూర్వకంగా సృష్టించింది. ప్రజలు మంచిగా చెబితే వినరు కాబట్టి.. నోట్లు లేకపోతే చచ్చినట్లు ఆన్ లైన్లో లావాదేవీలు జరుపుతారు. అప్పుడు ఎంచగ్గా టాక్సులు వసూలు చేయొచ్చు. .ఇదీ అసలు ఉద్దేశం.
        
మరోవైపు నల్లదొరలకు షాక్ ఇవ్వడానికే కొత్త 500నోట్లు లేట్ చేస్తున్నారనే వాదన ఉంది. ఇప్పుడు ఎక్కువ మొత్తంలో 2వేల నోట్లు విడుదల చేసి, అవి నల్లదొరలు స్టోర్ చేసుకునేలా చేశారు. రేపు సడెన్ గా 2వేల నోటు రద్దు చేసి.. కేవలం 500 నోట్లే చెల్లుతాయంటున్నారు. దాంతో చచ్చినట్లు నల్లదొరలు డిపాజిట్ల కోసం కష్టపడక తప్పదు.
       
కేంద్రం ప్లాన్ చూస్తుంటే.. పిల్లికి చెలగాటం.. ఎలుక్కి ప్రాణసంకటంలా ఉంది. నల్లడబ్బు వెలికితీయడం కోసం ఏకంగా సామాన్యుల జీవితాలతో, దేశ ఆర్థిక వ్యవస్థతోనే కేంద్రం జూదమాడుతోందని, పర్యవసానాలు ఎలా ఉంటాయో ఈ కసరత్తు పూర్తయ్యాకే తెలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు