'నోట్' దిస్ ప్రాబ్లెమ్స్ యువరానర్..!

'నోట్' దిస్ ప్రాబ్లెమ్స్ యువరానర్..!

తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు.. భూకంపాలు వచ్చినప్పుడు ఎదురయ్యే కష్టాలన్నీ కరెన్సీ నోట్ల రద్దుతో కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయం నల్ల కుబేరులను దారిలోకి తెస్తుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి సామాన్య ప్రజల జీవితాలను అతలాకుతలం చేసేసింది. చేతిలో డబ్బున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయులుగా మార్చేసింది.

వరదలు, తుపాన్లు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో సర్వం పోగొట్టుకున్నవారికి ఎలాగూ కష్టాలు తప్పవు. కానీ.. చేతి నిండా డబ్బున్నా కూడా కేజీ బియ్యం కొనలేని పరిస్థితి... ఇల్లు దాటి ఎక్కడకూ వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. కరెన్సీ నోట్ల రద్దుతోనూ దాదాపుగా అదే పరిస్థితి ఉత్పన్నమైంది. ప్రజల జేబులో, ఇంట్లో 500, 1000 నోట్లు ఉంటున్నాయి.. కానీ, అది తీసుకెళ్లి కూరగాయలు కొందామంటే తీసుకునేవారే లేరు. పెట్రోలు పోయించుకుందామంటే 'చేంజ్ చాహియే' అన్న మాట వినిపిస్తోంది.

ఎక్కడా 500, 1000 నోట్లను తీసుకోవడానికి వ్యాపారులు అంగీకరించడం లేదు.  అత్యవసర పనులకు డబ్బు చెల్లింపులో సమస్యలు ఎదురవుతున్నాయి.  ఉన్న నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియని పరిస్థితి.  చేతిలో డబ్బున్నా చేతకానితనం. సరే... క్రెడిట్ కార్డుతోనో డెబిట్ కార్డుతోనో కొనుక్కుందామన్నా సంపాదించుకోవడానికి ఇదే సందు అంటూ వ్యాపారులు దానిపై  క్స్‌ట్రా ట్యాక్స్ అంటూ వసూల్లు మొదలుపెట్టారు. వెరసి... మోడీ నిర్ణయం సామాన్యుడి జీవితాన్ని అతలాకుతలం చేసేసింది.

హాస్పిటళ్లు, బస్సులు, రైళ్లలో రద్దయిన నోట్లను యాక్సెప్టు చేయాలని కేంద్రం ఆదేశించినా అదెక్కడా అమలు కావడం లేదు. రైల్వేస్టేషన్లు, బస్సుల్లో ఈ నోట్లు తీసుకోకపోవడంతో జనాలు వేరే నోట్లు లేక ప్రయాణాలు మానుకుంటున్నారు.

తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకోవడానికి తగినంత సమయం ఇచ్చినా... చెలామణీని వెంటనే రద్దు చేయడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పెరిగిన ధరల నేపథ్యంలో ప్రతీ ఒక్కరి జేబులో లేదా పర్సులో రూ. 500, రూ. 1000 నోట్లు ఉంటున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో లావాదేవీలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.  నోట్లను మార్చుకోవడానికి తగినంత సమయం వచ్చినా, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉండే కూలీలు, గ్రామీణుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి బ్యాంక్ అకౌంట్లే లేవు. ఉన్న నోట్లను బ్యాంకులకు, పోస్టాఫీసులకు వెళ్ళి మార్చుకోవడంపై వీరికి అంతగా అవగాహన ఉండదు. వీరి నిరక్షరాస్యతను స్థానిక నాయకులు ఆసరాగా చేసుకొని వీరిని మోసం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నారుు. పోనీ బ్యాంకులు, పోస్టాఫీసులు వెళ్ళి మార్చుకోవాలంటే ఒక రోజు కూలిని వదులుకోవాల్సిందే.

పదో తారీఖు నుంచి కొత్త నోట్లు చెలామణీలోకి తీసుకొస్తున్నా... ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు విధించడంతో భారీ లావాదేవీలు చేసే వీలుండదు. ఈ మేరకు మా వ్యాపారం దెబ్బతింటుందని వ్యాపారస్తులు వాపోతున్నారు. అసలే ఇది పెళ్లిల సీజన్ కావడంతో పెళ్లిలకు కావాల్సిన నగదును ఇప్పటికే చాలామంది విత్‌డ్రా చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు లాంఛనాల సమయంలో నగదు ఎలా ఇవ్వాలో అర్థంకాని పరిస్థితి. అసలు నల్లధనం ఉన్న వారు ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకున్నారని, కానీ నల్లధనం పేరుతో సామాన్యునులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు