ఎన్‌టీఆర్‌కు గుడి....ఎక్క‌డో తెలుసా

ఎన్‌టీఆర్‌కు గుడి....ఎక్క‌డో తెలుసా

మ‌న‌సుండాలే కానీ మార్గాలు అనేకం- అనేది త‌ర‌చు మ‌నం వినే డైలాగ్‌. ఇప్పుడు ఇలాంటి కామెంట్‌నే అభిమానం ఉండాలే కానీ ఏమైనా చేయొచ్చ‌ని నిరూపిస్తున్నాడు చిత్తూరుకు చెందిన సీనియ‌ర్ ఎన్‌టీఆర్ వీరాభిమాని ఒక‌రు. ఎన్‌టీఆర్‌కు విగ్ర‌హం ఏర్పాటు చేయ‌డ‌మే కాకుండా ఓ గుడిని కూడా ఈయ‌న నిర్మించారంటే.. ఆ వీరాభిమానాన్ని ఎంతని మ‌నం అంచ‌నా వేయ‌గ‌లం. వాస్త‌వానికి మ‌న తెలుగు రాష్ట్రాల్లో నేత‌ల‌కు గుడులు క‌ట్టేసంప్ర‌దాయం లేదు. త‌మిళ‌నాడులో మాత్ర‌మే సీఎం జ‌య స‌హా మాజీ సీఎం ఎంజీఆర్ వంటివారికి గుడులు ఉన్నాయి. జ‌యకు కట్టిన గుడిలో ఇప్ప‌టికీ పూజ‌లు పున‌స్కారాలు కూడా జ‌రుగుతున్నాయ‌ట‌.

మ‌రి చిత్తూరు ప్రాంతం త‌మిళ‌నాడుకు ప‌క్క‌నే ఉంటుంది కాబ‌ట్టి ఆ వాస‌న‌లు అంటుకున్నాయో ఏమో తెలీదు కానీ, చిత్తూరులోని పీ. శ్రీనివాసులు అనే వ్య‌క్తి సీనియ‌ర్ ఎన్‌టీఆర్‌కు పెద్ద ఎత్తున గుడి క‌ట్టించారు. అయితే, ఈయ‌న‌గారేమీ పెద్ద బిజినెస్ మ్యానో, ఇండ‌స్ట్రియ‌లిస్టో అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్టే. శ్రీనివాసులు ఓ వృద్ధుడు. ఈయ‌న‌కు ప్ర‌భుత్వం నెల‌నెలా అందించే వృద్ధాప్య పింఛ‌న్‌తోపాటు చిన్న‌పాటి బ‌డ్డీ కొట్టే ఆధారం. అయిన‌ప్ప‌టికీ.. మ‌నం పైన చెప్పుకొన్న‌ట్టు.. మ‌న‌సుండాలి.. టైపులో ఎన్‌టీఆర్‌పై ఈయ‌న‌కు వెల‌క‌ట్ట‌లేని వీరాభిమానం ఉంది.

త‌న‌కున్న కొద్దిపాటి ఆర్థిక వెసులుబాటుతోనే చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని కంచనపల్లె గ్రామంలో ఎన్‌టీఆర్‌కి టెంపుల్ క‌ట్టాడు. అంతేకాదు, అక్క‌డ ఎన్‌టీఆర్ విగ్ర‌హానికి పూజ‌లు చేసేందుకు కూడా అన్నీ రెడీ చేసేసుకున్నాడు. అయితే, ఆయ‌న‌కు ఇక్క‌డే ఆర్థిక స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయ‌ట‌. నిత్యం పూజ‌లు చేయాలంటే రోజూ ఖ‌ర్చుతో ప‌ని ఉంద‌ని, ఆర్థికంగా త‌న‌కు అంత స్తోమ‌త లేద‌ని త‌న స‌న్నిహితుల వ‌ద్ద శ్రీనివాసులు వాపోతున్నాడ‌ట‌. సో.. ఆయ‌న‌కు ఎవ‌రైనా ఆర్థికంగా సాయం చేస్తే.. త‌న కోరిక తీరుతుంద‌న్న‌మాట‌. మ‌రి ఎవ‌రైనా దాత‌లు శ్రీనివాసులు కోరిక‌ను తీరుస్తారో లేదో చూడాలి !!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు