కాంట్రవర్సీ ఫొటో వెనుక అసలు విషయం చెప్పిన లోకేష్

కాంట్రవర్సీ ఫొటో వెనుక అసలు విషయం చెప్పిన లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న తాను మంత్రిగా ఉన్న చిన రాజప్పను గౌరవిస్తానని సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన కుటుంబ ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా ఇటీవల వివాదానికి కారణమైన ఓ ఫొటో పై లోకేష్ మాట్లాడారు. మంత్రి చినరాజప్ప వేదిక కింద నిలబడి ఉండగా, వేదికపై ఉన్న లోకేష్ ఏదో ప్రశ్నిస్తున్నట్టుగా, దీనికి మంత్రి సమధానం ఇస్తున్నట్టు ఆ ఫొటో ఉంది. దీనిపై విపక్ష వైకాపా పెద్ద ఎత్తున దుమారం రేపింది.

 దీనిపై ఈ రోజు ప్రెస్మీట్లో స్పందించిన లోకేష్.. ఆ ఫొటో కల్పితమని చెప్పారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకే ప్రతిపక్షం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.వాస్తవానికి చిన రాజప్ప కూర్చునే ఉన్నారని, ఆయనేదో విషయం చెప్పాలని, మైక్ తీసుకోవడానికి నిలబడ్డారని లోకేష్ వివరించారు. ఆయన చెప్పాల్సింది చెప్పారని, ఆ తర్వాత కూర్చున్నారని లోకేష్ తెలిపారు. దాన్ని కూడా తప్పంటే ఎలా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ నియమనిబంధనలను ఉల్లంఘించలేదని చెప్పారు. ఇక, పార్టీలో పదవుల గురించి కూడా వివరించారు.

పార్టీ నియమనిబంధనల ప్రకారం పొలిట్బ్యూరో సభ్యులు మాత్రమే వేదికపై కూర్చుంటారని, అందులో సభ్యులు కాని వారు మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా వేదిక కింద భాగాన ఏర్పాటు చేసిన సీట్లలో కూర్చుంటారని చెప్పారు. ఒకవేళ తానే మంత్రివర్గ సమావేశానికి హాజరైతే.. ఇలాంటి పద్ధితినే పాటిస్తానన్నారు. కులం, మతం, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి చిచ్చు పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని లోకేష్ విమర్శించారు. మొత్తానికి వివాదానికి దారితీసిన ఫొటోపై లోకేష్ వివరణ ఇచ్చారన్నమాట. మరి ఇప్పటికైనా వైకాపా నేతలు శాంతిస్తారో? లేక దీనిపైనా ఫైరవుతారో చూడాలి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు