సిల్లీ ప్లాన్స్‌తో వైకాపా సెల్ప్ గోల్స్

సిల్లీ ప్లాన్స్‌తో వైకాపా సెల్ప్ గోల్స్

నిర్మాణాత్మక స్థాయిలో వ్యవహరించాల్సిన విపక్ష వైకాపా సిల్లీ విమర్శలతో తన పరువును తానే తీసుకుంటోంది. ఏపీ ప్రభుత్వం సహా చంద్రబాబును ఆయన ఫ్యామిలీని విమర్శించడం, వారిని ఇరుకున పెట్టడం అనేది విపక్ష వైకాపాకు సాధారణమే. నిజానికి ప్రభుత్వంలోని లోపాలను, అవినీతిని, చంద్రబాబు శైలిలోని లోపాలను ఎండగట్టడం వరకు ఎవరూ తప్పుపట్టరు. అసలు విపక్ష పార్టీగా వైకాపా చేయాల్సింది కూడా అదే. ఒక పక్క నిర్మాణాత్మక సూచనలు చేస్తూనే విమర్శలు చేయొచ్చు. అప్పుడు అసలు విషయంపై ప్రజల్లోనూ అవగాహన ఏర్పడుతుంది. ప్రభుత్వంపై మైనస్ మార్కులు పడి అవి ప్లస్సులుగా మారి వైకాపాకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది. కానీ, రాను రాను వైకాపా నేతల తీరు.. దిగజారి పోతోందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు!

తాజాగా.. టీడీపీ శిక్షణ శిబిరం కేంద్రంగా వైకాపా విమర్శలు జోరందుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ శిక్షణ శిబిరంలో ఏం జరిగినా.. అది పూర్తిగా పార్టీ వ్యక్తిగత వ్యవహారం. అయినప్పటికీ.. వైకాపా పత్రిక సాక్షి దానిలో జరిగిన లోపాలను పెద్దవి చేసి చూపించడం ఏమంత బాగోలేదని తెలుస్తోంది. ఈ శిబిరంలో మంత్రి చినరాజప్పను పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ నిలదీస్తున్నట్టుగా ఉన్న ఫొటోను ప్రచురించి మరీ సాక్షి యాంటీ న్యూస్ రాసింది. దీనిని అందిపుచ్చుకున్న వైకాపా నేత అంబటి రాంబాబు విమర్శల జోరు పెంచారు. అయితే, అదే సమయంలో టీడీపీ కూడా అసలు చినరాజప్పతో లోకేష్ మాట్లాడిన వీడియో టేపును బయటపెట్టింది. దీంతో ఏం మాట్లాడాలో తెలియని అంబటి.. మళ్లీ పాత చింత కాయ్ మాదిరిగా అప్పుడెప్పుడో జూనియర్‌ను వాడుకుని వదిలేశారంటూ.. ఆ విమర్శలను పైకి తెచ్చి కొత్తవాటిలా వినిపించారు. దీంతో జనాలకు బోర్ తెప్పించేశారు.

ఇక, ఇదే సమయంలో అరంగేట్రం చేసిన లక్ష్మీపార్వతి.. కూడా అల్లుడు చంద్రబాబు, మనవడు లోకేష్‌లపై దుమ్మెత్తి పోశారు. కుట్రలకు కేరాఫ్ చంద్రబాబేనన్నారు లక్ష్మీపార్వతి. ఆ చంద్రబాబుకు అవినీతి ప్రతి బింబం లోకేష్ అని నిప్పులు చెరిగారు. అయితే అసలు విషయం ఏంటంటే.. ఇక్కడ కుట్రలు ఏమీ జరగేలేదు. మరి ఆమె ఎందుకు విమర్శించినట్టు? అంటే సమాధానం కరువు! ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శించారు అంతే!! కానీ, ఇలాంటి చీఫ్ ట్రిక్స్ వల్ల టీడీపీకి నష్టం మాట అటుంచితే.. వైకాపా నేతలంటేనే రోత పుట్టే పరిస్థితి వచ్చేస్తోంది అన్న విషయం వీరు మరచిపోతున్నారన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది.

ప్రధాన విపక్షంగా వైకాపా టీడీపీని విమర్శించేందుకు అనేక అంశాలు ఉన్నాయి. ఇసుక దోపిడీ మొదలు కుని ఎమ్మెల్యేల వీరంగం, పుష్కర నిధుల హాం ఫట్.. అధికారుల లంచావతారం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల వ్యవహారం, గిరిజన ప్రాంతాల్లో అందని ప్రభుత్వ సేవలు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. కానీ, వీటన్నింటినీ వదిలి పెట్టి.. సిల్లీ విమర్శలతో పొద్దు పుచ్చడం అంతిమంగా పార్టీకి మేలుకంటే నష్టమే అన్నది ఆ పార్టీ అధినేత జగన్‌తో పాటు ఇతర నాయకులు గుర్తు పెట్టుకుంటే మంచిది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు