'తెలంగాణ వచ్చుడే ప్రజల దురదృష్టం'

'తెలంగాణ వచ్చుడే ప్రజల దురదృష్టం'

అధికార పార్టీని విపక్షం విమర్శించడం, చిక్కుల్లో పడేసేందుకు యత్నించడం ఎక్కడైనా జరిగే తంతే. తెలంగాణలో ఫామ్‌లోకి వచ్చేందుకు తిప్పలు పడుతున్న కాంగ్రెస్ నేతలూ ఈ థియరీనే ఫాలో అవుతున్నారు. కానీ ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో తమ వాగ్ధాటిలో దొర్లుతున్న అసంబద్ధ కామెంట్స్‌కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. టీఆర్‌ఎస్‌ను తిప్పలు పెట్టడమే లక్ష్యంగా కురిపిస్తున్న విమర్శల్లో చాలా మటుకు వారికి బూమరాంగ్‌లా మారుతున్నాయి. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటిలా తమ గొంతు నొక్కే ఛాన్స్‌ను ప్రభుత్వానికి వారే ఇచ్చేస్తున్నారు. ఇటీవలే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాష్ట్రంలో జిల్లాల కోసం నెలకొన్న డిమాండ్లు, ఆందోళనలను ప్రస్తావిస్తూ తెలంగాణ వచ్చుడే ప్రజల దురదృష్టం అని వ్యాఖ్యానించారు. ఇప్పడు ఈ వ్యాఖ్యానమే టీఆర్‌ఎస్ పాలిట వరమైంది. అనేకమంది ప్రాణత్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని బాధ్యతాయుత పదవిలో ఉన్న ఓ నేత ఇలా తీసిపారేయడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడిన రాష్ట్ర అంశాన్ని సీఎంను విమర్శించడం కోసం ఉత్తమ్ కుమార్ తీసిపారేయడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ప్రభుత్వంపై ఉత్తమ్ కుమార్ సంధించిన విమర్శనాస్త్రాల్లో "తెలంగాణ వచ్చుడే ప్రజల దురదృష్టం" అనే స్టేట్‌మెంట్ కూడా ఒకటి. ప్రజల మెప్పు పొందే క్రమంలో అధికార పార్టీని ఎండగడుతూ ఉత్తమ్ కుమార్ నోట ఈ పలుకులు ధ్వనించాయి. అయితే, "రాష్ట్రం రాకపోయి ఉంటేనే బెటర్" అన్నది ఆయన ఉద్దేశం కాకపోవచ్చు. కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం అదే అర్ధాన్ని స్ఫురిస్తున్నాయి. కాబట్టి మాట్లాడుతున్నప్పుడు నేతలు కాస్త కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తే బాగుంటుంది. లేకుంటే ఇప్పుడున్నంత స్వల్ప ఆదరణ కూడా కాంగ్రెస్‌కు భవిష్యత్‌లో ఉండకపోవచ్చు. ప్రజాదారణ లేకపోతే రాష్ట్రంలో హస్తం పార్టీ భవిత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అందుకే భావోద్వేగ వాగ్ధాటిపై కాస్త దృష్టిసారించుకుని కాంగ్ నేతలు ముందడుగేయాలి. లేకపోతే టీఆర్‌ఎస్ చేతికి కాంగ్రెస్ జుట్టు అందించినట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు