మళ్లీ రెడీ అవుతున్న ముద్రగడ

మళ్లీ రెడీ అవుతున్న ముద్రగడ

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని కాపులకు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నా.. ఆ సామాజిక వర్గం శాంతించడం లేదా? ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన హామీల అమలుకోసమే కాపులు డిమాండ్‌ చేస్తున్నారా? తమకు రిజర్వేషన్‌ కావాలనే పట్టుబడుతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. గడిచిన కొన్నాళ్లుగా రాష్ట్రంలో ఉద్యమిస్తున్న కాపులు.. ఎప్పటికప్పుడు శాంతిస్తూ.. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కాపుల పరిస్థితులను అధ్యయనం చేయడానికి, వారిని బీసీల్లో చేర్చాలా వద్దా అనే విషయాన్ని తేల్చడానికి ప్రభుత్వం మంజునాథ కమిషన్‌ను కూడా వేసింది. అదేసమయంలో కాపుల అభ్యున్నతి కోసమంటూ ఏడాదికి వెయ్యి కోట్లు కేటాయిస్తామని పేర్కొంటూనే కాపు కార్పొరేషన్‌ను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనేక విద్యార్థులకు ఈ కార్పొరేషన్‌ ద్వారా నిధులు ఇస్తూ.. ఉన్నత విద్య అభ్యసించేందుకు దోహదం చేస్తోంది.

అయినప్పటికీ.. కాపుల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కాపు ఉద్యమాన్ని భుజాన వేసుకున్న ముద్రగడ పద్మనాభం మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఆదివారం హైదరాబాద్‌కు వస్తున్నారనే వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.  హైదరాబాదు రానున్న ముద్రగడ... తన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు దాసరి నారాయణరావు, చిరంజీవిలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఆ తర్వాత హైదరాబాదులోని కాపు ప్రముఖులను కూడా ఆయన కలవనున్నట్లు సమాచారం. గతంలోనూ వారిని కలిసిన ఆయన కాపు ఉద్యమానికి మద్దతు కోరడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ముద్రగడ గృహనిర్బంధం చేసుకుని.. దీక్ష చేపట్టినప్పుడు చిరంజీవి, దాసరి తదితరులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం తెలిసిందే. దీంతో ఇప్పుడు మరోసారి తాను ఉద్యమానికి దిగాల్సిన పరిస్థితులు వస్తున్నాయని శనివారం విశాఖలో వెల్లడించిన ముద్రగడ అనుకున్నదే తడవుగా తన ఉద్యమానికి మద్దతు కూడగట్టడం గమనారం. దీంతో ఆయన హైదరాబాద్‌ పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి రాజధానిలోనే ఉండే ముద్రగడ.. తన మలిదశ ఉద్యమానికి పకడ్బందీ ప్లాన్‌ వేస్తున్నారని సమాచారం. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు