యాగం ఎలా జరిగింది జగన్..

యాగం ఎలా జరిగింది జగన్..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందు ఎన్నో ఆసక్తికరమైన అంశాలకు వేదికగా మారింది. చాలాకాలం తర్వాత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒకే వేదికపై కలిశారు. ఇరువురు సీఎంలతోపాటు తొలిసారిగా ఏపీ విపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తో పాటు ఆయన సతీమణి విమలా నరసింహన్‌ వైఎస్‌ జగన్‌తో ఆసక్తికరంగా సంభాషించారని అంటున్నారు.

ఎట్‌ హోం కార్యక్రమంలో పాల్గొనేందుకు తొలిసారి రాజ్‌భవన్‌కు వచ్చిన ఏపీ విపక్ష నేత జగన్‌ను గవర్నర్‌ నరసింహన్‌ పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. తేనీటి విందుకు హాజరు కావడం ఆనందంగా ఉందని గవర్నర్‌ మాట్లాడిన సందర్భంగా జగన్‌ చెప్పారు. తొలిసారి రాజ్‌భవన్‌కు వచ్చినందున కార్యక్రమం ముగిసేవరకు ఉండాలని జగన్‌ను గవర్నర్‌ కోరారు. అందుకు జగన్‌ కూడా సమ్మతించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ సతీమణి విమల వివిధ అంశాలపై జగన్‌తో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇటీవల రుషికేష్‌లో నిర్వహించిన యాగంలో జగన్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సమాచారాన్ని విమల నరసింహన్‌ ఆసక్తికరంగా అడిగి తెలుసుకున్నట్లు చెప్తున్నారు. రుషికేష్‌ ఎలా ఉందని, యాగం చేయడం మంచిదన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి సంతోషించిన వైఎస్‌ జగన్‌ అంతా మంచి జరగాలనే ఉద్దేశంతోనే యాగానికి వెళ్లినట్లు తెలిపారు. ఇదిలాఉండగా తేనీటి విందు కార్యక్రమం ముగిసిన వెనువెంటనే జగన్‌ వెళ్లిపోవడం గమనార్హం.

ఇదిలాఉండగా..అందరిలాగానే తేనీటి విందుకు హాజరైన ప్రముఖులను పలకరించి అభివాదం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు విపక్ష నేత జగన్‌కు కూడా అభివాదం చేసి కరచాలనం చేసే ప్రయత్నం చేశారు. జగన్‌ మాత్రం కేవలం అభివాదానికి మాత్రమే పరిమితమై కరచాలనం చేసేందుకు విముఖత చూపారు. దీంతో అక్కడే ఉన్న ఏపీ శాసన మండలి చైర్మన్‌ డాక్టర్‌ చక్రపాణి జోక్యం చేసుకుని చంద్రబాబుకు, జగన్‌ చేత కరచాలనం చేయించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English