టీడీపీ మంత్రుల ధైర్యం నచ్చింది

టీడీపీ మంత్రుల ధైర్యం నచ్చింది

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి పట్ల తెలుగుదేశం పార్టీ నేతల అసంతృప్తి తారాస్థాయికి చేరుతోంది. ఇటు పార్టీ పరంగా జరుగుతున్న అంతర్మథనానికి తోడు ప్రతిపక్షాల నుంచి ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కేంద్రం వైఖరికి నిరసనగా తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రులు సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు పార్టీ అధినేత చంద్రబాబు వద్ద సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం.

హోదాపై లోక్ స‌భలో జరుగుతున్న చర్చ, అందులో అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై పార్టీ ఎంపీలతో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాడివేడిగా జరిగిన ఈ సమావేశంలో ప్రత్యేక హోదా గురించి జైట్లీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. "పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నా, బీజేపీతో కలిసి పనిచేస్తున్నాం. కేవలం రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తున్నాం. అయినా, జైట్లీ తమకేమీ పట్టనట్టు మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు టీవీలో చూసినప్పుడు నాకెంతో కోపం వచ్చంది. సభలో ఉన్న మీరు ఎందుకు ఆయన వ్యాఖ్యలను ఖండించలేకపోయారు?" అని చంద్రబాబు ఎంపీలను ప్రశ్నించారు. సభలో వ్యూహాత్మకంగా వ్యవహరించలేదంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు."హోదా సాధించడంలో విఫలమైతే, భవిష్యత్లో ప్రజలు ఎవ్వరినీ క్షమించరు. పార్లమెంట్లో ప్రజల పక్షాన పోరాడాల్సింది మీరే. ప్రజలు అన్ని విషయాలూ గమనిస్తున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేను పదే పదే ఢిల్లీకి రాను. రాష్ట్రం తరపున మీరే మాట్లాడాలి. కేంద్రంపై వత్తిడి తేవాలి్ణ అంటూ చంద్రబాబు ఎంపీలకు క్లాస్ తీసుకున్నారు. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఆయనకు వివరించండి. మోదీ వ్యవహార శైలిని పరిశీలించిన తరువాత మనం ఒక నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు ఎంపిలకు చెప్పారు.

ఈ నేపథ్యంలో ఎంపీలు చంద్రబాబు ఎదుట ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. మంత్రులు సుజన, అశోక గజపతిరాజు మాట్లాడుతూ సభలో సమాచార లోపం వలన చర్చలో తడబడ్డామని అన్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజు సీఎంకు చెప్పారు. మీరు ఆమోదిస్తే, వెంటనే రాష్టప్రతిని కలిసి రాజీనామా లేఖలు సమర్పిస్తామని అన్నారు. అయితే తొందరపడద్దంటూ వారిని చంద్రబాబు వారించినట్టు తెలిసింది. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకునే ముందు నిరసనలు తెలపడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని సమావేశం తరువాత కూడా ఏపీకి న్యాయం జరుగుతుందని తేలకపోతే, మన దారి మనం చూసుకుందామని చంద్రబాబు ఎంపీలకు చెప్పినట్టు తెలిసింది. కొందరు ఎంపీలు మాట్లాడుతూ ఆర్థిక పరమైన ఇబ్బంది లేకపోయినా, నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం ససేమిరా అంటోందని అన్నారు. అలాగే ఏపీకి ఏ విషయంలోనూ కేంద్రం నిధులు మంజూరు చేసేందుకు ఇష్టపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు