తెలుగు రాష్ట్రాల్లో అత్తారింటికి దారేది

తెలుగు రాష్ట్రాల్లో అత్తారింటికి దారేది

తెలుగు రాష్ట్రాల పోలీసులు కొత్త స్టైలు ఫాలో అవుతున్నట్లుగా ఉంది. ఆందోళనలు, నిరసనలకు దిగుతున్న రాజకీయ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు వారిని స్టేషనుకు తీసుకెళ్లకుండా రోడ్లన్నీ తిప్పుతున్నారు. కొద్ది గంటల పాటు అలా తిప్పాక స్టేషనుకు తీసుకెళ్లి ఆ తరువాత విడిచిపెడుతున్నారు. ఏదో ఒక సందర్భంలో అవసరమైందని ప్రతిసారీ వారు అదే మార్గం ఎంచుకుంటుండడతో ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీసులకు మంచి వాహనాలను సమకూర్చాయి. దీంతో నేతలను అరెస్టు చేశాక సరదాగా షికార్లు తిప్పుతున్నారంటూ సెటైర్లు పడుతున్నాయి.

తాజగా మెదక్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ సర్కారు నిర్మించతలపెట్టిన మల్లన్న సాగర్‌  ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులుగా మారనున్న వారిని పరామర్శించేందుకు వెళ్లిన టీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఆ పార్టీ సీనియర్‌ నేత షబ్బీర్‌ అలీలను పోలీసులు ఒంటిమామిడి వద్ద అడ్డుకున్నారు.  మల్లన్నసాగర్‌ ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి మేడ్చల్‌ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించేందుకు పోలీస్‌ వ్యాన్‌ లో ఎక్కించారు. అయితే వారిని స్టేషనుకు తీసుకెళ్లకుండా ఎక్కడెక్కడికో తిప్పారట. తమను ఎక్కడికి తీసుకువెళుతున్నారో కూడా తెలియడం లేదని జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడికి తీసుకువెళుతున్నారో చెప్పాలని కోరినా చెప్పడం లేదని.. రోడ్లపై  చక్కర్లు కొడుతున్నారని జానారెడ్డి వ్యాఖ్యానించారు.

రెండు రోజుల కిందట టీటీడీపీ నేత రేవంత్‌ రెడ్డినీ అదే పనిచేశారు. మల్లన్న సాగర్‌ విషయంలోనే ఆయన్నూ అరెస్టు చేసి దేశమంతా తిప్పారు. ఇంతకుముందు కాపుల ఆందోళనల సమయంలో ఏపీ పోలీసులూ అలాగే చేశారు. ముద్రగడ పద్మనాభాన్ని అరెస్టు చేసిన తరువాత ఆయన్ను ఇంటికి తీసుకెళ్తామని చెప్పి సాయంత్రం వరకు రోడ్లన్నీ తిప్పారు. దీంతో పోలీసులకు ఇది ఫ్యాషన్‌ గా మారిందని రాజకీయ  నేతలు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English