పవన్...రావడం లేటయితే కష్టమే

పవన్...రావడం లేటయితే కష్టమే

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్. ఆంధ్రప్రదేశ్‌ను అతలాకులతలం చేస్తున్న కాపు ఆందోళనలో అదే సామాజివర్గానికి చెందిన నటుడిగా పవన్ స్పందన కోసం ఇటు కాపు కులస్తులే కాదు అటు రాజకీయవర్గాలు సైతం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌తో దీక్ష చేస్తున్న కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న వార్తలు ఆ సామాజికవర్గంలో అలజడి సృష్టిస్తున్నాయి. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి డాక్టర్లు ప్రయత్నించడం, దానిని ముద్రగడ నిరాకరించిన వార్తలు, కాపువర్గాలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో దాని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. బంద్ పిలుపుతో ఉదయం నుంచే షాపులు బందు చేయడం బట్టి నిరసన స్థాయి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోందని అంటున్నారు. పోలీసులు ఎంత నిర్బంధించినా కాపులు రోడ్లమీదకు వస్తున్న పరిస్థితి ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇంకా ఆ తీవ్రత మొదలుకాకపోయినా, కాపు సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కాపుజాతి ప్రయోజనాల కోసం ఒకవైపు ముద్రగడ, ఆయనకు మద్దతుగా తామంతా ప్రత్యక్ష కార్యాచరణలో దిగితే, తమ వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండాన్ని కాపులు సహించలేకపోతున్నారని అంటున్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సైతం ముద్రగడ ఆందోళన వ్యవహారంలో పవన్ తీరును విమర్శించడం గమనార్హం. ఏ సమస్యనూ పవన్ పట్టించుకోవడం లేదని, పవన్ హీరోగా వచ్చి జీరోగా మారారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హన్మంతరావు కూడా పవన్ ట్వీట్లతో కాలక్షేపం చేయకుండా, అక్కడికి వెళ్లి ముద్రగడ దీక్షకు మద్దతునీయాలని ఇదివరకే సూచించారు. సొంత జాతి ప్రయోజనాల కోసం ముద్రగడ నిస్వార్థంగా ఆందోళన చేస్తుంటే, పవన్‌కు కనీసం పరామర్శించి, మద్దతు ప్రకటించే ఓపిక లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాబు వద్ద తన పలుకుబడి వినియోగించి, కాపు సమస్యలను పరిష్కరించే కనీస ప్రయత్నం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇదిలాఉండగా తనకు కులం అంటకట్టవద్దని, తాను అందరివాడినని గతంలో పవన్ స్పష్టం చేశారు. అయితే, దానిపై విమర్శలు రావడంతో మళ్లీ ముద్రగడ లేవనెత్తిన అంశాలతోపాటు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను, నమ్మిన వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ట్విట్టర్ ద్వారా కోరారు. అయితే ప్రస్తుతం అలాంటి స్పందన కూడా లేకపోవడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ రావడం ఆలస్యం అయినా రావడం పక్కా ఉంటుందా అనే సందేహాలు కూడా వెలువెత్తడం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు