స‌ల‌హాలిస్తాడంటే చంద్ర‌బాబుకు స‌మ‌స్య‌లు తెచ్చాడు

స‌ల‌హాలిస్తాడంటే చంద్ర‌బాబుకు స‌మ‌స్య‌లు తెచ్చాడు

ప్ర‌పంచంలో భక్తిని మించి బ‌ల‌మైన బంధం లేదు... భ‌క్తి, విశ్వాసాల‌ను దెబ్బ‌తీసేలా చేసే వ్యాఖ్య‌లు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇటీవ‌ల కాలంలో త‌న ప్ర‌వ‌చ‌నాల‌తో కోట్లాది మంది ఆద‌ర‌ణ పొందిన చాగంటి కోటేశ్వ‌ర‌రావు ఆ ఆద‌ర‌ణ‌తో అనూహ్యంగా ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వంలో మంచి ప‌ద‌విని అందుకున్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో సాంస్కృతిక స‌ల‌హాదారుగా ఆయ‌న కొద్దిరోజుల కింద‌ట నియ‌మితులైన సంగ‌తి తెలిసిందే. అయితే.... చంద్ర‌బాబు ఏరికోరి తెచ్చుకున్న ఆయ‌న ఇంత‌కాలం లేని రీతిలో ఇప్పుడు త‌న వ్యాఖ్య‌ల‌తో చంద్ర‌బాబుకు ఇబ్బంది తెచ్చిపెట్టారు. ఇంత‌కుముందు ఏం చేసినా అది ఆయ‌న‌కు మాత్రమే న‌ష్టం చేసేది.. కానీ, ఇప్పుడు ఏపీ సాంస్కృతిక స‌ల‌హాదారుగా ఉన్న ఆయ‌న ఆచితూచి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, ఆ విష‌యం మ‌రిచిన ఆయ‌న అసంద‌ర్భ ప్ర‌వ‌చ‌నాల‌తో చంద్ర‌బాబును ఇరుకున‌పెట్టారు. షిర్డీ సాయిబాబాపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సాయిభ‌క్తులకు తీవ్ర ఆగ్ర‌హం క‌లిగిస్తున్నాయి. అంతేకాదు... ఇలాంటివాడిని స‌ల‌హాదారుగా ఎలా పెట్టుకున్నార‌ని చంద్ర‌బాబును ప్ర‌శ్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ సాంస్కతిక సలహాదారు చాగంటి కోటేశ్వర్‌రావుపై షిరిడీసాయి భక్త బృందం ఆగ్రహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల భక్తులున్న షిరిడీసాయినాధునిపై చాగంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం దారుణ‌మ‌ని మండిపడుతున్నారు.  షిరిడీ సాయి విగ్ర‌హాల‌ను ఆరాధించ‌డం ప‌ట్ల ఆయ‌న అభ్యంత‌రాలు వ్య‌క్తంచేయ‌డంపై భ‌క్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు. భక్త సంఘం తరపున జీవన్ రెడ్డి ఇప్ప‌టికే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చాగంటి చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఈ విషయమై ఆయ‌న నేతృత్వంలో భ‌క్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడును కలిసి చాగంటిపై ఫిర్యాదు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు.

కాగా ఈ విష‌యం ఇప్ప‌టికే చంద్ర‌బాబు వ‌ద్ద‌కు చేరిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై ఆయ‌న చాగంటిని పిలిచి వివ‌ర‌ణ కోర‌న‌ప్ప‌టికీ ఇక‌పై ఆచితూచి మాట్లాడాల‌ని సంకేతాలు పంపిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. ఆధ్మాత్మిక మేధావిగా చాగంటి ప‌ట్ల ఉన్న గౌర‌వంతో చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ఆయ‌న్ను మంద‌లించాల‌న్న ఉద్దేశంలో లేర‌ని... సునిశిత మేధావి అయిన చాగంటి తాజా ప‌రిణామాల నుంచి గుణ‌పాఠం నేర్చుకుని ప్ర‌భుత్వానికి మ‌చ్చ తేకుండా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ఆయ‌న అనుకుంటున్నార‌ని తెలుస్తోంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు