ఈ నెల 11న విడుదల.. ముద్రగడ 'బ్రహ్మాస్త్రం'

ఈ నెల 11న విడుదల.. ముద్రగడ 'బ్రహ్మాస్త్రం'

కాపు రిజర్వేషన్ల కోసం ఇప్పటికే ఒక విడత పోరాటం జరిపి చంద్రబాబు ప్రభుత్వాన్ని గడగడలాడించిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. మొన్న ఆమరణ దీక్షకు దిగినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో విరమించిన ఆయన మరోసారి ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని... కాపులకు ఇస్తామన్న రుణాలన్నీ కేవలం తెలుగుదేశం వారికే ఇస్తున్నారని ఆరోపిస్తూ 11వ తేదీ నుంచి మళ్లీ ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు.

తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతున్న ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. కాపులకు ఇచ్చిన వాగ్దానాలతోనే గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తరువాత వాటిని మరిచారని విమర్శించారు. లేఖ రాసిన తర్వాతే వారికి హామీలు గుర్తుకు వచ్చాయని అన్నారు. కాపు రుణమేళా పెట్టి తనను తిట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాపు జాతిఅంతరించిపోవాలని చూడటం మంచి పద్దతా అని ప్రశ్నించారు. దీక్ష సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా ముద్రగడ మరోసారి ఆమరణ దీక్ష చేస్తానంటూ తేదీని ప్రకటించడంతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవుతున్న నేపథ్యంలో ముద్రగడ మళ్లీ కార్యాచరణ ప్రకటించడంతో ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నదని టీడీపీ వర్గాలు అంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు