దీక్ష తుస్సు - అమ్మ కస్సు బుస్సు

 దీక్ష తుస్సు - అమ్మ కస్సు బుస్సు

సందర్భ శుద్ధి గానీ, సంకల్ప శుద్ధి గానీ ఉండాలనే నిబంధన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కి లేదు. ఆ పార్టీ సిద్ధాంతాల్లో గాని, విధానాల్లో గానీ అలాంటివి ఉండవు. అందుకే ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఔచిత్యం లేని డిమాండ్లతో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఒక్కటే లక్ష్యంగా ఫీజు దీక్షను చేపట్టారు. రాజన్న సర్కారు ఫీజుల పేరుతో కార్పొరేట్‌ కళాశాలలకు దోచిపెట్టదలచుకుంటే.. తమ అనుయాయులైన సదరు కాలేజీల అక్రమార్జనలకు ఈ సర్కారు గండి కొడుతున్నదని ఆమె ప్రధాన ఆవేదన. అయితే.. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌లో నిబంధనలు విధించినందుకు నిరసనగా ఆమె ఈ దీక్ష చేపట్టారు. విద్యార్థులు వేల సంఖ్యలో వెల్లువలా వచ్చేసి.. దీక్షను విజయవంతం చేస్తారని, అంతో ఇంతో పంచాయతీ ఎన్నికలకు కూడా ఉపయోగపడగల మైలేజీ వస్తుందని ఆమె ఆశించారు. అయితే తానొకటి తలిస్తే దేవుడు మరొకటి తల్చాడన్నట్లుగా తయారయింది ఆమె పరిస్థితి. ఎందుకంటే.. 14, 15 తేదీల్లో దీక్ష చేయాలని అనుకుంటే.. భారీ వర్షాలు పలకరించాయి. వాయిదా వేసి 18, 19 తేదీలు అన్నారు. అప్పటికి వానలు తగ్గలేదు గానీ. మళ్లీ వాయిదా వేస్తే ద్వితీయ విఘ్నం అవుతుందని వారు భయపడ్డారు. దీక్ష కంటిన్యూ అయింది.

అయితే ఇదివరకటి యాత్రలు, ఉద్యమాల విషయంలో కొన్ని చేదు అనుభవాలను చవిచూసిన విజయమ్మ ఈ దీక్ష సందర్భంగా జనం తాకిడి తగ్గకూడదని ముందే  పార్టీ హైదరాబాదు , రంగారెడ్డి జిల్లాల నాయకులకు ఫత్వా జారీచేశారు. దానికి అనుగుణంగానే.. వైకాపాకు అనుకూలురు అయిన.. హైదరాబాదు చుట్టుపక్కల ఉండే కళాశాలల విద్యార్థులను ప్రత్యేకంగా పురమాయించి మరీ తరలించారు. ఇన్ని టెక్నిక్కులు ఫాలో అయినప్పటికీ.. దీక్ష మాత్రం ప్రజాస్పందన పరంగా విజయవంతం కాలేదు.

అయితే ప్రభుత్వస్పందన పరంగా విజయవంతం కాదు కదా.. అసలు ప్రతివిమర్శలను దారుణంగా రుచిచూడాల్సి వచ్చింది. ఈ నెగటివ్‌ రిజల్టుపై విజయమ్మకు ఆగ్రహం వచ్చిందిట. ప్రభుత్వంలోని మంత్రులు తిరిగి విమర్శించినందుకు ఎక్కువ కోపం ఉన్నప్పటికీ.. దాన్ని తిప్పికొట్టలేక.. జనం రాలేదనే వైఫల్యానికి బాధ్యులైన నాయకుల మీద మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసిందిట. వారి మీద కోపం వీరి మీద చూపిస్తే ఎలా అమ్మా...? తమరే ఆలోచించండి!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు