వివాదంలో కొత్త సినిమా

త‌మిళంలో ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి మంచి మంచి సినిమాలు చేసి హీరోగా ఒక స్థాయిని అందుకున్న న‌టుడు విష్ణు విశాల్. ఇప్పుడ‌త‌ను తెలుగు మార్కెట్ మీద క‌న్నేశాడు. ఇప్ప‌టికే అర‌ణ్య చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన విష్ణు.. ఇప్పుడు లీడ్ రోల్‌లో న‌టించిన‌ ఎఫ్ఐఆర్ మూవీతో ఆడియ‌న్స్‌ను ప‌ల‌క‌రించాడు. ఉగ్ర వాద నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి మంచి టాకే వ‌చ్చింది. అదే స‌మ‌యంలో ఈ సినిమాలో చూపించిన కొన్ని అంశాలు వివాదాస్ప‌ద‌మ‌య్యాయి. ఇటు ముస్లింల‌తో పాటు హిందువుల్లో ఓ వ‌ర్గం ఈ సినిమా ప‌ట్ల అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది.

ముస్లింల‌ను ఉగ్ర‌వాదులుగా చూపించ‌డాన్ని ఆ వ‌ర్గం వాళ్లు త‌ప్పుబ‌డుతుంటే.. హిందువులు కూడా ఉగ్ర‌వాదుల్లో భాగ‌మే అన్న‌ట్లు ప్రొజెక్ట్ చేయ‌డాన్ని హిందువులు త‌ప్పుబ‌డుతున్నారు. ఈ అంశాల కార‌ణంగానే ఎఫ్ఐఆర్ మూవీకి సెన్సార్ ఇబ్బందులు కూడా త‌లెత్తాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమాను మూడు దేశాల్లో నిషేధించ‌డం గ‌మ‌నార్హం. మ‌లేషియా, కువైట్, ఖ‌తార్ దేశాల్లో ఈ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో సెన్సార్ బోర్డు నుంచి అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

అయినా అడ్డంకుల్ని దాటి సినిమాను రిలీజ్ చేయ‌గా.. ఇప్పుడు తెలంగాణ‌లో ఈ సినిమా ప‌ట్ల అభ్యంత‌రాలు వ్య‌క్తం కావ‌డం గ‌మనార్హం. ఎంఐఎం ఎమ్మెల్యేలు కొంద‌రు ఈ సినిమాను నిషేధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సినిమా పోస్ట‌ర్లో క‌నిపించే కొన్ని ప‌దాలు అభ్యంత‌రక‌రంగా ఉన్నాయ‌ని.. ముస్లింలను త‌ప్పుగా చూపించేలా అవి ఉన్నాయ‌ని.. అందుకే ఈ సినిమాను నిషేధించాల‌ని వారు డిమాండ్ చేశారు. ఈమేర‌కు తెలంగాణ‌ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని యాద‌వ్‌ను క‌లిసి త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. ఐతే ఈ అభ్యంత‌రాల‌పై మంత్రి ఎలా స్పందిస్తారో కానీ.. మంచి సినిమా అయిన‌ప్ప‌టికీ తెలుగులో బ‌జ్ లేక‌పోవ‌డం వ‌ల్ల ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించ‌లేక‌పోతున్న ఈ సినిమాకు ఈ వివాద‌మైనా క‌లిసొస్తుందేమో చూడాలి.