దేవరకొండ ఆ సినిమాను బయటికి తీస్తున్నాడా?

దేవరకొండ ఆ సినిమాను బయటికి తీస్తున్నాడా?

విజయ్ దేవరకొండ హీరోగా కొన్ని నెలల కిందట ‘హీరో’ పేరుతో బహు భాషా చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరుపుకుని.. ఒక షెడ్యూల్ చిత్రీకరణ కూడా పూర్తి చేసుకున్నాక ఈ చిత్రానికి అనూహ్యంగా బ్రేక్ పడింది.

తొలి షెడ్యూల్‌లో షూట్ చేసినంత వరకు రషెస్ చూసుకుని తీవ్ర అసంతృప్తికి గురైన చిత్ర బృందం సినిమాను ఆపేసినట్లుగా గుసగుసలు వినిపించాయి. 8 నిమిషాల నిడివికే దర్శకుడు ఆనంద్ అన్నామలై రూ.15 కోట్లు ఖర్చు పెట్టించేయడంతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తే భారీ నష్టాలు తప్పవన్న ఉద్దేశంతో మైత్రీ మూవీ మేకర్స్ వెనక్కి తగ్గినట్లుగా చెప్పుకున్నారు.

విజయ్‌తో మైత్రీ వాళ్లు చేసిన ‘డియర్ కామ్రేడ్’ ఫ్లాప్ కావడం కూడా ఆ సినిమాపై ప్రభావం చూపింది. ఈ సినిమా గురించి గత మూణ్నాలుగు నెలల్లో ఏ అప్ డేట్ లేదు. ఓవైపు క్రాంతి మాధవ్ సినిమాలో నటిస్తూ.. మరోవైపు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేయడానికి విజయ్ ఒప్పుకున్న నేపథ్యంలో ‘హీరో’ ఇక బయటికి వచ్చే అవకాశమే లేదని అంతా అనుకున్నారు. ఇంతలో ‘హీరో’ పేరుతో తమిళంలో మరో సినిమా తెరకెక్కుతుండటం కూడా ఈ సందేహాలకు మరింత బలం చేకూర్చింది.

ఐతే తాజా సమాచారం ప్రకారం విజయ్ ఈ సినిమా మీద ఆశలు వదులుకోలేదని.. దీన్ని పున:ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కాల్సిన ఈ చిత్రం కోసం విజయ్ ఇంటర్నేషనల్ రేసింగ్ ఛాంపియన్ రజని కృష్ణన్ దగ్గర శిక్షణ కూడా తీసుకున్నాడని.. నవంబర్లో సినిమాను పున:ప్రారంభించాలనే పట్టుదలతో విజయ్ ఉన్నాడని.. మైత్రీ వాళ్లను కూడా అందుకు ఒప్పించాడని.. దర్శకుడు మధ్యలో స్క్రిప్టు మీద మరింత వర్క్ చేసి బెటర్ వెర్షన్‌తో రెడీ అయ్యాడని అంటున్నాడు. చూద్దాం ఈ వార్తలెంత వరకు నిజమో.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English