రికార్డులొద్దు సాహో.. పెట్టింది వస్తే చాలు

రికార్డులొద్దు సాహో.. పెట్టింది వస్తే చాలు

భారతీయ ప్రేక్షకులు అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన భారీ చిత్రం ‘సాహో’ శుక్రవారమే థియేటర్లలోకి దిగేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ సహా పలు చోట్ల స్పెషల్ షోలు పడిపోయాయి. నిఖార్సయిన టాక్ ఏంటన్నది మధ్యాహ్నానికి కానీ తెలియదు. మరి టాక్ ఎలా ఉంటుందో అన్న గుబులు ఇటు మూవీ మేకర్స్‌లో, అటు డిస్ట్రిబ్యూటర్లలో ఉంది.

‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద ఏ స్థాయిలో అయితే పెట్టుబడి పెట్టారో అదే స్థాయిలో దీని మీదా బయ్యర్లు భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఐతే ‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద ఉన్నంత ధీమా దీని మీద లేదు. ఎందుకంటే ‘బాహుబలి: ది బిగినింగ్’ అప్పటికే బ్లాక్ బస్టర్ అయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే క్యూరియాసిటీ భారతీయ సినీ చరిత్రలోనే మరే సినిమాకూ రానంత హైప్ ‘ది కంక్లూజన్’కు తెచ్చి పెట్టింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడం అన్నది ముందే ఫిక్స్. ఎందుకంటే అక్కడున్నది రాజమౌళి మరి. బ్లాక్‌బస్టర్‌ను మించి ఏ స్థాయికి చేరుతుందనే అంతా చూశారు.

కానీ ‘సాహో’ సంగతి అలా కాదు. కేవలం ప్రభాస్ మేనియాను నమ్ముకుని ఈ సినిమా మీద అయిన కాడికి డబ్బులు పెట్టేశారు. ‘బాహుబలి-2’ స్థాయి రేట్లకు అమ్మేశారు. బయ్యర్లది ఏం ధైర్యమో ఏమో నిర్మాతలు డిమాండ్ చేసిన మేరకు డబ్బులిచ్చి సినిమాను కొనేశారు. కానీ రిలీజ్‌కు వారం ముందున్న కాన్ఫిడెన్స్ దగ్గరికొచ్చేసరికి లేదు. సినిమాకు ఒకవేళ టాక్ తేడా వస్తే ఏంటి పరిస్థితి అనే భయం అందరిలోనూ నెలకొంది. దీంతో ప్రభాస్ సహా అందరూ టెన్షన్లో ఉన్న సంగతి స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమా టాక్ విషయంలో తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు.

కొన్ని రోజుల ముందు వరకు రికార్డుల మీదే అందరి దృష్టీ ఉండేది. కానీ ఇప్పుడు రికార్డుల సంగతి తర్వాత సినిమాపై నిర్మాతలు, బయ్యర్లు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చి అందరూ సేఫ్ అయితే చాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ అందరూ సేఫ్ అయ్యారు అంటే ఆటోమేటిగ్గా రికార్డుల మోత మోగడం కూడా ఖాయం. మరి సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో.. దీనికి ఎంత లాంగ్ రన్ ఉంటుందో.. చివరికి ఎలాంటి వసూళ్లు వస్తాయో చూద్దాం.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English