మురుగదాస్ గురించి ఎంత బాగా చెప్పాడో..

సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్‌ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్‌ను ఉర్రూతలూగిస్తూ ఆయన తీసిన కొన్ని సినిమాలు సంచలనం రేపాయి. రమణ (ఠాగూర్ ఒరిజినల్), గజిని, తుపాకి, కత్తి.. ఆయన గొప్ప పనితనానికి రుజువుగా నిలుస్తాయి. ఈ సినిమాలతో సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా ఎదిగాడు మురుగదాస్.

గజని చిత్రాన్ని అదే పేరుతో హిందీలో ఆమిర్ ఖాన్ హీరోగా రీమేక్ చేసి అక్కడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మురుగదాస్. కానీ కత్తి తర్వాత ఆయన తీసిన సినిమాలు వరుసగా ఫెయిలవడంతో కెరీర్లో వెనుకబడ్డాడు. ఐతే శివకార్తికేయన్ మూవీతో రీఎంట్రీ ఇస్తున్న మురుగదాస్‌కు హిందీ నుంచి సల్మాన్ ఖాన్‌తో ఓ పెద్ద సినిమా తీసే అవకాశం దక్కింది. ఇలాంటి టైంలో మురుగదాస్‌కు బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ మంచి ఎలివేషన్ ఇచ్చాడు.

మురుగదాస్ లాంటి నిష్కల్మషమైన, నిజాయితీ కలిగిన దర్శకుడు మరొకరిని తాను చూడలేదని ఆమిర్ ఖాన్ ఓ టీవీ షోలో కొనియాడడం విశేషం. ఆయన ఏం మాట్లాడినా.. ఏ అభిప్రాయం వ్యక్తపరిచినా.. దానికి ఫిల్టర్ అనేది ఉండదని.. చాలా నిజాయితీగా తాను ఏం చెప్పాలనుకున్నాడో అది చెబుతాడని ఆమిర్ ఖాన్ తెలిపాడు. సినిమాకు సంబంధించి మనం ఏదైనా ఐడియా చెప్పామంటే.. నచ్చితే సూపర్ హిట్ సూపర్ హిట్ అని ఎగ్జైట్ అవుతాడని.. అదే సమయంలో ఆ ఐడియా నచ్చకుంటే.. నిర్మొహమాటంగా బాలేదని చెప్పేస్తాడని.. మొహమాటాలు ఉండవని ఆమిర్ చెప్పాడు.

మనం ఈ అభిప్రాయం చెబితే అవతలి వ్యక్తి ఏమనుకుంటాడో.. చెడుగా తీసుకుంటాడేమో అనే ఆలోచన ఆయనకు ఉండదని.. ఫిల్టర్ లేకుండా తన అభిప్రాయం చెప్పడం ఆయనలోని గొప్ప గుణమని ఆమిర్ తెలిపాడు. మురుగదాస్ నుంచి తాను నేర్చుకున్న మంచి విషయం ఇదే అని ఆమిర్ తెలిపాడు. మురుగదాస్‌తో పని చేసిన చాలామంది ఇదే మాట అంటుంటారు.