ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా ఆయన తీసిన పలు చిత్రాలు సంచలనం రేపాయి. ఐతే తర్వాత తర్వాత సరైన సినిమాలు పడక.. వరుస ఫెయిల్యూర్ల వల్ల ఆయన జోరు తగ్గిపోయింది. కొన్నేళ్ల పాటు అసలు సినిమాలే ప్రొడ్యూస్ చేయకుండా సైలెంట్‌గా ఉన్న రత్నం.. మళ్లీ బిజీ అవ్వాలని చూస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆయన ‘హరి హర వీరమల్లు’ లాంటి భారీ చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య మొదలైన ఈ సినిమాకు మంచి హైపే వచ్చింది. కానీ ఈ చిత్రం అనుకున్న సమయానికి పూర్తి కాక.. షూట్ మధ్యలో ఆగిపోయి.. ఎంతకీ పున:ప్రారంభం కాక.. ఎప్పుడు రిలీజవుతుందో తెలియక రత్నం చాలా ఇబ్బంది పడుతున్నాడు.
దాదాపు రెండొందల కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న సినిమా ఇంత కాలం ఆగితే.. వడ్డీల భారం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. దీని వల్ల ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరిగిపోతోంది. కానీ పవన్ కళ్యాణ్‌కు ఉన్న వేరే సినీ, రాజకీయ కమిట్మెంట్ల వల్ల దీనికి బల్క్ డేట్లు ఇవ్వలేక సినిమా పూర్తి కావట్లేదు. దీంతో రత్నం మీద ఆర్థిక భారం బాగా పెరిగిపోయింది. ఇలాంటి టైంలో ఆయనకు రెండు దశాబ్దాల కిందట ప్రొడ్యూస్ చేసిన ‘గిల్లి’ సినిమా కొంత ఊరటనిచ్చింది.
ఈ చిత్రాన్ని ఇటీవలే రీ రిలీజ్ చేశారు. ఇలా స్టార్ హీరోల పాత సినిమాలను రిలీజ్ చేస్తే రెండు మూడు కోట్లో.. మహా అయితే ఐదు కోట్లో కలెక్షన్ రావడం మామూలే. కానీ ఈ చిత్రం వరల్డ్ వైడ్ ఏకంగా పాతిక కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం. రీ రిలీజ్ హక్కులు, కలెక్షన్ల వాటా రూపంలో ఆయనకు మంచి ఆదాయమే వచ్చింది. కష్ట కాలంలో ఈ సినిమా ఆయనకు కొంత ఊరటనిచ్చిందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.