లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు. కానీ వ్యక్తిత్వ పరంగా ఇళయరాజా తీరు తరచుగా వివాదాస్పదం అవుతుంటుంది. మ్యూజికల్ కన్సర్ట్‌లు నిర్వహించినపుడు.. ఇంకేదైనా కార్యక్రమాల్లో ఇళయరాజా మాట్లాడే, ప్రవర్తించే తీరు వల్ల ఆయనపై అహంకారి అనే ముద్ర పడింది.
మరోవైపు తన పాటలకు సంబంధించి హక్కులు, రాయల్టీ విషయంలో ఆయన తరచుగా గొడవలకు దిగుతుంటారు. తనకు ఆప్త మిత్రుడైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. మ్యూజికల్ కన్సర్ట్స్‌లో తన పాటలు వాడుకుంటున్నాడని నోటీసులు పంపడం అప్పట్లో ఎంత వివాదాస్పదం అయిందో తెలిసిందే. బాలు లాంటి వారితో మాట్లాడి తేల్చుకోవాల్సిన విషయానికి నోటీసులివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాలు కూడా అప్పట్లో ఈ విషయమై ఎంతో బాధ పడ్డాడు.
కాగా ఇటీవల తన పాటల హక్కులకు సంబంధించి కొన్ని సంస్థలతో గొడవ తలెత్తి ఆయన కోర్టుకు వెళ్లడం.. ఈ క్రమంలో కేవలం సంగీత దర్శకుడికి మాత్రమే అన్ని హక్కులు చెందుతాయా, గీత రచయితల సంగతేంటి అని కోర్టు ఎదురు ప్రశ్నించడం చర్చనీయాంశం అయింది. పాటల హక్కులు, రాయల్టీ విషయంలో ఇళయరాజా మరీ ఇంత పట్టుదలకు పోవాలా అనే చర్చ జరిగింది. ఆ సంగతలా ఉంచితే.. తాజాగా రజినీకాంత్ కొత్త చిత్రం ‘కూలీ’ టీజర్లో కొన్ని క్షణాల పాట తన పాటను వాడుకున్నందుకు ఇళయరాజా ఆ చిత్ర బృందానికి నోటీసులు పంచడం హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో బ్యాగ్రౌండ్లో వా వా పక్కం వా అనే ఇళయరాజా పాట వినిపిస్తుంది.
ఐతే తన అనుమతి లేకుండా తన పాటను వాడుకున్నారంటూ ఈ చిత్ర బృందానికి ఇళయరాజా నోటీసులు పంపించేశారు. ఇళయరాజా మీద అభిమానంతో ఆయన పాటల్ని బ్యాగ్రౌండ్లో వాడుకోవడం అన్నది ఎప్పట్నుంచో ఉన్నదే. ఈ క్రమంలో ఆయనకు సినిమాల్లోని పాత్రలు గొప్ప ఎలివేషన్ కూడా ఇస్తుంటాయి. ఇది ఎవరైనా అభిమానంతో చేస్తారే తప్ప.. ఆయన పాటల్ని వాడేసుకుని ప్రయోజనం పొందాలని కాదు. ఇలా అంటే ఏ సినిమాలో కూడా ఏ పాత పాట వినిపించడానికి అవకాశమే ఉండదు. ఈ విషయంలో ఇళయరాజా తీరును చాలామంది తప్పుబడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates