సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ గురించి షూటింగ్ స్టార్ట్ కాకుండానే పలు ఆసక్తికరమైన సంగతులు బయటికి వస్తున్నాయి. దీన్ని నిర్మిస్తున్న శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కెఎల్ నారాయణ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం కలగక మానదు. నిజానికీ కలయిక 15 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకున్నది. అంటే బాహుబలి కన్నా ముందు, జక్కన్న కమర్షియల్ డైరెక్టర్ గా బ్లాక్ బస్టర్లు కొడుతున్న టైంలో ఒప్పుకున్నది. కానీ ఏవేవో కారణాల వల్ల వాయిదా పడగా, ఈలోగా రాజమౌళి పేరు ప్రపంచస్థాయికి చేరుకోవడం జరిగిపోయింది.
అయినా సరే ఇచ్చిన మాట కోసం కట్టుబడిన మహేష్ బాబు, రాజమౌళిలు ఇంత ఆలస్యమైనా సరే దుర్గా ఆర్ట్స్ కే సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో నారాయణ ఆశ్చర్యపోయారు. ఇలాంటి పరిస్థిత్తుల్లో మాములుగా కొందరు ఇచ్చిన అడ్వాన్స్ వడ్డీతో సహా వెనక్కు ఇచ్చేసి హమ్మయ్య అనుకుంటారు. అందులోనూ మార్కెట్ రేంజ్ వందల కోట్లు దాటిపోయాక ఇంత కంటే వేరే ఆప్షన్ పెట్టుకోరు. కానీ అలా చేస్తే నైతికత ఎక్కడ ఉన్నట్టు. అందుకే ఇద్దరూ ఒకే మాటకు కట్టుబడి ప్రొడక్షన్ కి దూరంగా ఉన్న నారాయణ. గోపాల్ రెడ్డిలను ఒప్పించి మరీ ప్రాజెక్టు పట్టాలు ఎక్కేలా చూశారు.
ఒకప్పుడు హలో బ్రదర్, క్షణ క్షణం, దొంగాట లాంటి బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్స్ ఇచ్చిన శ్రీ దుర్గా ఆర్ట్స్ కి ఇది చాలా ప్రతిష్టాత్మక చిత్రంగా మారనుంది. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31 ప్రారంభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎంఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తుండగా హీరోయిన్ తో సహా ఇతర క్యాస్టింగ్ ఎవరుంటారనే వివరాలు ఇంకా బయటికి చెప్పడం లేదు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చాక చేస్తున్న రాజమౌళి సినిమా కావడంతో అంతర్జాతీయ కంపెనీలు ఇందులో భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇంకొద్ది రోజులు ఆగితే అన్నింటి సస్పెన్స్ పూర్తిగా తీరిపోనుంది.