రజనీ సినిమా ఇంకోటి ఫిక్స్

రజనీ సినిమా ఇంకోటి ఫిక్స్

వేరే వ్యాపకాలేమీ లేక సినిమాలకే పరిమితం అయినపుడేమో.. సినిమాకు సినిమాకు మధ్య చాలా విరామం తీసుకుని అభిమానుల్ని నిరాశకు గురి చేశాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక సమయంలో అయితే మూడేళ్ల పాటు రజనీ నుంచి సినిమా రాలేదు. రెండేళ్ల విరామంతో సినిమాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

రెండేళ్ల ముందు వరకు ఏడాదికి ఒక సినిమా రావడమే గగనంగా ఉండేది. కానీ ఈ మధ్య మాత్రం వరుసబెట్టి సినిమాలు చేసేస్తున్నాడు సూపర్ స్టార్. 2018-19 మధ్య ఆరు నెలల వ్యవధిలో రజనీ సినిమాలు మూడు రిలీజ్ కావడం విశేషం. గత ఏడాది జూన్‌లో ‘కాలా’ రిలీజైతే.. నవంబరుకు ‘2.0’ వచ్చింది. ఇంకో రెండు నెలలకే ‘పేట’తో పలకరించాడు. ఇంకో ఏడాదికల్లా ‘దర్బార్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఐతే అదే సమయానికి పార్టీని ప్రకటించి ఇంకొన్ని నెలల్లో పూర్తి స్థాయి రాజకీయాల్లో దిగనున్న రజనీ.. ఇక సినిమాలకు విరామం ఇచ్చినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఆగట్లేదు. వచ్చే ఏడాది ఇంకో సినిమాతో పలకరించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అజిత్‌తో వరుసగా నాలుగు సినిమాలు చేసిన శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

‘విశ్వాసం’తో ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ అందుకున్న శివ.. సూర్యతో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవలే వెల్లడైంది. దాన్ని పూర్తి చేసి రజనీతో వచ్చే ఏడాది అతనో సినిమా చేయనున్నాడన్నది తాజా సమాచారం. ఈ చిత్రాన్ని రజనీ అల్లుడు ధనుష్ కానీ.. కలైపులి థాను కానీ నిర్మించే అవకాశాలున్నాయట. ఐతే ఇలా సినిమాలు చేసుకుంటూ పోతే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు రజనీ ఎలా సన్నద్ధమవుతాడు.. పార్టీని ఎలా సిద్ధం చేస్తాడు అన్నది ప్రశ్న.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English