క్రిటిక్స్ రేటింగులపై షారుక్ అసహనం

క్రిటిక్స్ రేటింగులపై షారుక్ అసహనం

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఇప్పుడు మామూలు ఫ్రస్టేషన్లో లేడు. అతను ఓ మోస్తరు సక్సెస్ చూసి కూడా చాలా ఏళ్లయిపోయింది. ప్రేక్షకుల్ని బలహీనతల్ని సొమ్ము చేసుకునేలా కొన్ని సినిమాలు చేసి డబ్బులు రాబట్టుకున్న షారుఖ్ ఖాన్‌కు తర్వాత తర్వాత అదే ప్రతికూలంగా మారింది. అతడికున్న క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బ తినేసింది. మార్కెట్ పోయింది. పైగా ఎంచుకున్న కథల్లోనూ విషయం లేకపోవడంతో వరుసగా ఎదురు దెబ్బలు తగిలాయి. కొంచెం రూటు మార్చి ‘ఫ్యాన్’, ‘జీరో’ లాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసినా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా ‘జీరో’ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది దారుణంగా దెబ్బ కొట్టింది. షారుఖ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు క్రిటిక్స్ తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. దీనిపై ముంబయిలో జరిగిన క్రిటిక్స్‌ ఫిలిం ఛాయిస్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో నేరుగా క్రిటిక్స్ ముందే అసహనం వ్యక్తం చేశాడు షారుఖ్.

‘‘మా లాంటి ఫిలింమేకర్స్‌ విభిన్న ఆలోచనలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తారు. మేం ప్రతిభ కోసం ఆరాటపడతాం. మేం ప్రేక్షకులకు చెప్పాలనుకునే కథలో నిజాయతీ ఉండేలా చూసుకుంటాం. కాబట్టి.. సినీ విశ్లేషకులు, విమర్శకులకు నా సలహా ఒక్కటే. మా ఫిలిం స్టార్స్‌లా మీరు ఆలోచిస్తూ.. స్టార్‌ సిస్టమ్‌కు అలవాటు పడిపోకండి. మీరు ఇచ్చే స్టార్‌ రేటింగ్స్‌ను బట్టి మా స్టార్‌డం ఆధారపడి ఉండదు. ఒక సినిమాకు 2 స్టార్స్, 3 స్టార్స్‌ అంటూ ఇచ్చుకుంటూ పోవడానికి ఇది హోటల్‌ కాదు. దయచేసి ఇలాంటి రేటింగ్స్‌ ఇచ్చి స్టార్‌డం కోల్పోయామని చెప్పకండి’’ అని షారుఖ్ అన్నాడు. షారుఖ్ సరిగ్గా ఏం చెప్పదలుచుకున్నాడన్నది అర్థం కాలేదు కానీ.. క్రిటిక్స్ ఇచ్చే రేటింగ్ సిస్టం పట్ల మాత్రం ఆయనకు సరైన అభిప్రాయం లేదన్నది మాత్రం స్పష్టం. ‘జీరో’ తర్వాత షాక్‌లోకి వెళ్లిపోయిన షారుఖ్.. రాకేశ్ శర్మ బయోపిక్ నుంచి తప్పుకోవడమే కాక.. ఇప్పటిదాకా తన కొత్త సినిమాను ఖరారు చేయనేలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English