ఊహించని మజిలీకి చేరిన మజిలీ

ఊహించని మజిలీకి చేరిన మజిలీ

‘మజిలీ’ సినిమా థియేట్రికల్ హక్కుల్ని రూ.21 కోట్లకు అమ్మినపుడు.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి వస్తుందా రాదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే నాగచైతన్య గత మూడు సినిమాలూ ఫ్లాపులే. అందులోనూ ‘యుద్ధం శరణం’, ‘సవ్యసాచి’ చిత్రాలైతే పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఈ నేపథ్యంలో చైతూ మీద ఎక్కువ నమ్మకం పెట్టి అందరూ రిస్క్ చేస్తున్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడు ‘మజిలీ’ సాధించిన వసూళ్లు చూస్తే షాకవ్వాల్సిందే. 17 రోజుల వ్యవధిలో ఈ చిత్రం రూ.36 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించడం విశేషం. ఆరంభంలో ‘మజిలీ’ జోరు చూసి ఇది రూ.30 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తుందని అనుకున్నారు.

కానీ రెండు, మూడు వారాంతాల్లోనూ చక్కటి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం అంచనాల్ని మించి పోయింది. ఏకంగా రూ.36 కోట్ల షేర్ వరకు వెళ్లింది. ఒక్క నైజాంలో మాత్రమే ఈ చిత్రం రూ.12.5 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. చైతూ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కంటే ‘మజిలీ’ రూ.10 కోట్లకు పైగా ఎక్కువ షేర్ రాబట్టింది ఇప్పటికే. తర్వాతి వారాల్లో వచ్చిన ‘చిత్రలహరి’, ‘జెర్సీ’ బాగా ఆడుతున్నప్పటికీ ‘మజిలీ’ తన ప్రత్యేకతను చాటుకోగలిగింది. కుటుంబ ప్రేక్షకుల్ని పెద్ద ఎత్తునే థియేటర్లకు రప్పించగలిగింది. ఇంకా కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఈ వారం కొత్తగా తెలుగు సినిమాలేవీ లేని నేపథ్యంలో వారాంతంలో దీనికి  మంచి షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు. థియేట్రికల్ రైట్స్ అమ్మకాలతో పాటు శాటిలైట్, డిజిటల్ ఇతర హక్కుల ద్వారా ‘మజిలీ’ నిర్మాతలకు భారీగానే ఆదాయం ముట్టింది. ఈ చిత్ర రీమేక్ హక్కుల కోసం కూడా పోటీ నెలకొన్నట్లు సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English