రజనీ సినిమాకు మళ్లీ పంచాయితీ తప్పదా?

రజనీ సినిమాకు మళ్లీ పంచాయితీ తప్పదా?

సూపర్ స్టార్ రజనీకాంత్‌ సినిమా అంటే ఒకప్పుడు తెలుగులో రూ.30 కోట్లకు అటు ఇటుగా మార్కెట్ ఉండేది. ‘కబాలి’ చిత్రాన్ని ఏకంగా రూ.32 కోట్లకు అమ్మారు. ‘2.0’ స్పెషల్ ఫిలిం కాబట్టి దాన్ని లెక్కలోకి తీసుకోకూడదు. దానికైతే రూ.72 కోట్ల దాకా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాంటిది ఆయన చివరి సినిమాను రూ.15 కోట్ల తక్కువ రేటుకు ఇవ్వాల్సి వచ్చింది. చివరికి ఆ మొత్తం కూడా భారంగా మారింది నిర్మాత వల్లభనేని వంశీకి. చాలా లేటుగా సంక్రాంతి రిలీజ్ డేట్ ఖరారవడం, తెలుగు వెర్షన్ డబ్బింగ్ పనుల్లోనూ ఆలస్యం జరిగి రెండు వారాల ముందు మాత్రమే తెలుగు రిలీజ్ ఖరారవడంతో వచ్చింది సమస్య. చాలా ముందుగా థియేటర్లు బుక్ చేసుకున్న ఇతర సంక్రాంతి చిత్రాల నిర్మాతలు.. ‘పేట’కు థియేటర్లివ్వడానికి నిరాకరించారు. దీంతో దీనిపై పెద్ద రచ్చ జరిగింది. అసలు సంక్రాంతి తెలుగులోనే మామూలుగా పోటీ ఎక్కువ కాబట్టి డబ్బింగ్ సినిమాలకు థియేటర్లివ్వడం చాలా కష్టం. దీనికి తోడు లేటుగా రేసులోకి వస్తే మరీ సమస్య అవుతుంది.

ఈ సంగతలా వదిలేస్తే ఇప్పుడు రజనీ మరోసారి సంక్రాంతి రేసుకు రెడీ అయిపోయాడు. మురుగదాస్ దర్శకత్వంలో ఆయన నటించనున్న కొత్త చిత్రం ‘దర్బార్’ ఫస్ట్ లుక్ ఈ రోజే రిలీజ్ చేశారు. అందులో సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించేశారు. తెలుగులో కూడా ఒకేసారి ఈ చిత్రం రిలీజవుతుందనడంలో సందేహం లేదు. వచ్చే సంక్రాంతికి తెలుగులో ఏ సినిమాలు వస్తాయన్నది ఇంకా క్లారిటీ లేదు. రెండు మూడు భారీ చిత్రాలైతే కచ్చితంగా షెడ్యూల్ అవుతాయి. మరి అప్పుడు రజనీ సినిమాకు థియేటర్ల పంచాయితీ తప్పకుండా వస్తుందనడంలో సందేహం లేదు. సంక్రాంతికి డబ్బింగ్ చిత్రాలు రిలీజ్ చేయొద్దన్న డిమాండ్ మరోసారి తెరమీదికి రావచ్చు. ఐతే కనీసం ముందుగా తెలుగు వెర్షన్ బిజినెస్ సంగతి తేలి.. ఇక్కడి నిర్మాత ముందుగా థియేటర్లు బుక్ చేసే ప్రయత్నం చేస్తే పరిస్థితి కొంచెం మెరుగుపడొచ్చు. చేజేతులా తన తెలుగు మార్కెట్‌ను దెబ్బ తీసుకున్న రజనీ ఈసారైనా కొంచెం శ్రద్ధ పెట్టి తెలుగు వెర్షన్ డీల్ సంగతి త్వరగా తేల్చాలి. సినిమాను ప్రమోట్ చేసి తెలుగు జనాల్లోకి సినిమాను తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. లేదంటే ఆయన మార్కెట్ మరింత దెబ్బ తినడం ఖాయం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English