ఎఫ్-3లో మూడో క్యారెక్టర్.. అప్పుడే రచ్చ మొదలు

ఎఫ్-3లో మూడో క్యారెక్టర్.. అప్పుడే రచ్చ మొదలు

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్ హిట్టయిన సినిమా ‘ఎఫ్-2’. మీడియం బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం పెట్టుబడి మీద మూడు రెట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఏకంగా రూ.85 కోట్ల షేర్ సాధించి ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద విజయం సాధించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా మరో సినిమా చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.

కుదిరితే బాలీవుడ్లో ‘హౌస్ ఫుల్’.. ‘గోల్ మాల్’ సిరీస్‌ల తరహాలో ‘ఎఫ్-2’ ఫ్రాంఛైజీని తీసుకురావాలని కూడా అనుకుంటున్నారు. ‘ఎఫ్-2’ సీక్వెల్‌కు ‘ఎఫ్-3’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేేసినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే ప్రకటించాడు. ఈ సినిమా 2021 సంక్రాంతికి వస్తుందని దిల్ రాజు అనౌన్స్ చేశాడు కూడా.

ఐతే దాని కంటే ముందు అనిల్, దిల్ రాజు.. వేరే ప్రాజెక్టుల్లో బిజీ అవుతున్నారు. కాగా ‘ఎఫ్-3’లో మూడో హీరో క్యారెక్టర్ కూడా ఉంటుందని అనిల్ రావిపూడి సంకేతాలివ్వగా..ఆ పాత్రకు ఎవరని ఎంచుకుంటారనే విషయంలో హాట్ డిస్కషన్ నడుస్తోంది.

ముందుగా ఈ పాత్ర కోసం రవితేజ పేరు వినిపించింది. తర్వాత సాయిధరమ్ తేజ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఇందులో మూడో హీరోగా నితిన్ నటిస్తాడని అంటున్నారు. ఈ మేరకు నితిన్ దగ్గర కమిట్మెంట్ తీసుకున్నారట. దిల్ రాజుతో నితిన్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉంది. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘దిల్’ ఇద్దరి రాతల్నీ మార్చింది. తర్వాత చాలా విరామం తర్వాత ‘శ్రీనివాస కళ్యాణం’ చేశారు. కానీ ఆ సినిమా నిరాశ పరిచింది. అప్పుడే ఇద్దరూ కలిసి ఇంకో సినిమా చేసి హిట్ కొట్టాలనుకున్నారు.

ఈ క్రమంలోనే ‘ఎఫ్-3’ చేయడానికి నితిన్ ఓకే చెప్పాడట. ఐతే ఈ సినిమాకు కథ రెడీ కాకుండా.. ఇప్పుడిప్పుడే సినిమా మొదలయ్యే అవకాశం కూడా లేనపుడు ఇంత త్వరగా ఈ ఊహాగానాలు అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఐతే మూడో హీరో సంగతేమో కానీ.. సీక్వెల్లో వెంకీ, వరుణ్ నటించడం మాత్రం పక్కా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English