డబ్బింగ్ సినిమాకు మురుగదాస్ మాటలు

డబ్బింగ్ సినిమాకు మురుగదాస్ మాటలు

‘స్పైడర్’.. ‘సర్కార్’ సినిమాలతో నిరాశ పరిచినప్పటికీ దక్షిణాదిన టాప్ డైరెక్టర్లలో మురుగదాస్ ఒకడు. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లబోతుండగా.. మధ్యలో మురుగదాస్ ఎవ్వరూ ఊహించని విధంగా ఒక ఇంగ్లిష్ డబ్బింగ్ సినిమాకు మాటలు రాసే పని పెట్టుకున్నాడు. ఆ చిత్రమే.. ఏవెంజర్స్: ఎండ్ గేమ్.

గత ఏడాది ‘ఏవెంజర్స్’ సిరీస్‌లో వచ్చిన ‘ఇన్ఫినిటీ వార్’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.14,500 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసి ప్రపంచ సినీ చరిత్రలోనే ఆల్ టైం హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. దీనికి కొనసాగింపుగా మార్వెల్ సంస్థ ‘ఏవెంజర్స్: ఎండ్ గేమ్’ను రూపొందించింది. ‘ఇన్ఫినిటీ వార్’ ఇండియాలో ఏకంగా రూ.250 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో ‘ఎండ్ గేమ్’ను కూడా భారీగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కాగా హిందీ, తెలుగు వెర్షన్లకు రైటర్లు ఫిక్సయ్యారు కానీ.. తమిళం సంగతే తేలకుండా ఉండింది. ఆశ్చర్యకరంగా మురుగదాస్ తమిళ వెర్షన్‌కు మాటలు రాయడానికి ముందుకు వచ్చాడట. ఈ కథ గురించి తెలుసుకుని ఇన్‌స్పైర్ అయి తనకు తానుగా మాటలు రాయడానికి మురుగదాస్ ముందుకొచ్చాడట. మామూలుగా ఇంగ్లిష్ డబ్బింగ్ సినిమాలకు ఊరూ పేరూ లేని రైటర్లు మాటలు రాస్తుంటారు. వాళ్ల పేర్లు కూడా బయటికి రావు.

ఇంగ్లిష్ అనువాదాల్లో మాటలు కూడా చాలా చిత్రంగా కూడా ఉంటుంటాయి. అలాంటి పని మురుగదాస్ తీసుకోవడమే ఆశ్చర్యం. అందులోనూ రజనీకాంత్ సినిమాకు స్క్రిప్టు రెడీ చేస్తూ ఆయన ఈ సినిమాను ఎంచుకోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ‘ఏవెంజర్స్: ఎండ్ గేమ్’ తమిళ వెర్షన్లో మురుగదాస్ ముద్ర ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English