ఎన్టీఆర్‌నే పట్టించుకోలేదు.. ఆయన సంగతేంటో?

ఎన్టీఆర్‌నే పట్టించుకోలేదు.. ఆయన సంగతేంటో?

నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కిన ‘యన్.టి.ఆర్’కు విడుదలకు ముందు ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. ఎన్టీఆర్ మీద జనాభిమానం ఏ స్థాయిదో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సావిత్రి బయోపిక్‌‌కే జనాల నుంచి అంతటి ఆదరణ లభిస్తే.. ఎన్టీఆర్ సినిమాను ఇంకెంతగా ఆదరిస్తారో అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్రిష్ ఈ సినిమాను చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి చక్కటి ప్రమోషన్లతో హైప్ పెంచాడు. ట్రైలర్ మరింతగా ఆకట్టుకుని అంచనాల్ని పెంచింది. దీంతో సినిమాకు బిజినెస్ ఓ రేంజిలో జరిగింది. సినిమాకు మంచి టాక్ కూడా వచ్చింది. దీన్ని మరో క్లాసిక్ అన్నారు చాలామంది. కానీ ఇన్ని అంశాలు కలిసొచ్చినప్పటికీ.. సినిమాకు వసూళ్లు మాత్రం రాలేదు. కనీస స్థాయిలో కూడా సినిమా ఆడలేదు. రూ.70 కోట్ల పై మొత్తానికి థియేట్రికల్ హక్కులు అమ్మితే రూ.20 కోట్ల షేర్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.

ఎన్టీఆర్ మీద తీసిన సినిమా.. పైగా మంచి టాక్ వచ్చింది.. అయినా ఇలాంటి పరిస్థితి ఉందంటే.. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ‘యాత్ర’ పరిస్థితి ఏమవుతుందో అన్న సందేహాలు మొదలయ్యాయి. వైఎస్ కూడా గొప్ప నాయకుడే కావచ్చు. జనాల్లో ఆయనకు మంచి ఆదరణ ఉండొచ్చు. కానీ ఎన్టీఆర్‌తో పోలిస్తే ఆయన వెనుకే ఉంటారు. పైగా ఆయనకు సినీ గ్లామర్ లేదు. మరి ఎన్టీఆర్ సినిమా చూడ్డానికే జనాలు అంతగా ఆసక్తి చూపించనపుడు.. వైఎస్ సినిమా చూడ్డానికి థియేటర్లకు కదులుతారా అన్నది సందేహం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్లు.. వైఎస్‌ను వ్యక్తిగతంగా అభిమానించిన వాళ్లు మాత్రమే థియేటర్లకు వస్తే సరిపోదు. సామాన్య ప్రేక్షకులే సినిమా తలరాతను నిర్ణయిస్తారు. ఆ తరహా ప్రేక్షకులు సినిమాను ఆదరించకపోతే మనుగడ కష్టమవుతుంది. అంత హైప్ ఉన్న ‘యన్.టి.ఆర్’నే వీళ్లు అంతగా పట్టించుకోనపుడు.. ముందు నుంచి పెద్దగా బజ్ లేని ‘యాత్ర’ పట్టించుకుంటారా అన్నది డౌటే. అందులోనూ వైఎస్ జీవితంలో ఒక భాగమైన పాదయాత్ర మీద ప్రధానంగా ఫోకస్ చేసిన సినిమా కావడంతో కమర్షియల్‌గా ఈ సినిమా సక్సెస్ కావడం మరింత కష్టం. ఈ సినిమా ట్రైలర్లో పెద్దగా డ్రామా కూడా కనిపించని విషయం తెలిసిందే. కాకపోతే తక్కువ బడ్జెట్లో తెరకెక్కడం, బిజినెస్ కూడా అందుకు తగ్గట్లే జరగడం.. ప్రేక్షకుల్లో మరీ ఎక్కువ అంచనాలు లేకపోవడం మాత్రం దీనికి ప్లస్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English