టీడీపీ ఆఫీసుల పై దాడులు, ఏపీలో కలకలం- జాతీయ మీడియాలో చర్చ

అమరావతిలోని కేంద్ర కార్యాలయంతో పాటు తెలుగుదేశం పార్టీ (టిడిపి) పలు జిల్లా కార్యాలయాలపై మంగళవారం సాయంత్రం దాడులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్ఆర్‌సిపి కార్యకర్తలు ఈ విధ్వంసానికి పాల్పడ్డారని, ఇది స్టేట్ టెర్రరిజం అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాజధాని అమరావతి, మంగళగిరి, విజయవాడ మరియు విశాఖపట్నం సహా మొత్తం 13 జిల్లాల్లోని ప్రధాన టీడీపీ కార్యాలయాలు లక్ష్యంగా చేసుకుని ఏకకాలంలో దాడులు జరగడం గమనార్హం. ఇది ముఖ్యమంత్రి జగన్ అభిమానులు ఆగ్రహం తో చేసిన పని అని వైఎస్సార్ కాంగ్రెస్ అంగీకరించడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఈ ఘటనకు రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం గురించి, ఏపీలో డ్రగ్స్ వ్యాపారాల గురించి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పెట్టిన మీడియా సమావేశం వల్లే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కారణాలు పక్కన పెడితే… రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీపై ఆర్గనైజ్డ్ గా ఏకకాలంలో దాడులు జరగడంపై రాష్ట్రమంతటా విస్మయం వ్యక్తమవుతోంది.

జాతీయ మీడియా దీనిని పెద్ద ఎత్తున కవర్ చేయడంతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపింది. పట్టపగలు దాడులు జరగడం ఏంటి అంటూ అందరూ విస్మయం వ్యక్తంచేస్తున్నారు. ఎక్కడా ఈ దాడులు జరిగినంత సేపు కూడా పోలీసులు అదుపు చేయకపోవడం మరింత చర్చనీయాంశం అవుతోంది. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో ఆస్తులు ధ్వంసం అయ్యాయి.

ఈ ఘటనపై టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌లకు ఫిర్యాదు చేశారు. టిడిపి కార్యాలయాలు మరియు పార్టీ కార్యకర్తలకు కేంద్ర భద్రతా రక్షణ కల్పించాలని నాయుడు అమిత్ షాను అభ్యర్థించారు. “ఇవి ప్రణాళికబద్ధమైన రాజకీయ ప్రేరేపిత దాడులు‘‘ అని తెలుగుదేశం వ్యాఖ్యానించింది.

ఈ దాడులకు సంబంధించిన వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. #YCPTerroristsAttack హ్యాష్ టాగ్ తో ఇది జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుండటం గమనార్హం.