నాగ్-నానిలతో మణిరత్నం ఢీ

నాగ్-నానిలతో మణిరత్నం ఢీ

తమకంటూ ఒక ప్రత్యేక అభిమాన వర్గాన్ని తయారు చేసుకున్న దర్శకుల్లో మణిరత్నం ఒకరు. ట్రాక్ రికార్డుతో.. టాక్‌తో సంబంధం లేకుండా మణిరత్నం సినిమా కోసం థియేటర్లకు వెళ్లిపోతారు ఆ వర్గం ప్రేక్షకులు. కేవలం తమిళంలోనే కాదు.. దక్షిణాది భాషలన్నింట్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగులోనూ భారీగా అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు మణి. ఆయన నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘చెక్కి చివంత వానమ్’. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 28న విడుదల చేయాలని మణి నిర్ణయించాడు.

షూటింగ్ మొదలైనపుడు తప్ప ఈ సినిమా గురించి అసలు ఏ అప్ డేట్ ఇవ్వలేదు. సడెన్‌గా రిలీజ్ డేట్ ప్రకటించేశాడు. సినిమా తీయడంలో మణిరత్నం స్లో కాబట్టి ఈ ఏడాది ఈ చిత్రం విడుదలవుతుందా లేదా అని అభిమానులు సందేహించారు. కానీ వాళ్లు అనుకున్న దాని కంటే ముందే సినిమా రిలీజైపోతోంది. ఈ చిత్రంలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, జ్యోతిక, అదితి రావు హైదరి.. ఇలా భారీ తారాగణమే ఉంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రాన్ని ‘2.0’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నమే నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రం తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా రావడానికి ఒక రోజు ముందే నాగార్జున-నానిల మల్టీస్టారర్ ‘దేవదాస్’ రిలీజవుతుంది. నాగ్, నాని ఇద్దరికీ మణిరత్నంతో మంచి అనుబంధం ఉంది. మణితో నాగ్ ‘గీతాంజలి’ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నాని ‘ఓకే బంగారం’లో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పాడు. వీళ్లిద్దరూ ఎంతో గౌరవించే మణిరత్నంతోనే వీళ్లు పోటీ పడుతుండటం ఆసక్తి రేకెత్తించే విషయమే. మరి ఈ రెండు మల్టీస్టారర్లలో ఏది ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు