శర్వా సినిమాలో ఆమె ప్రత్యేక పాత్ర

శర్వా సినిమాలో ఆమె ప్రత్యేక పాత్ర

పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న.. 30 ప్లస్‌లోకి వచ్చిన హీరోయిన్లకు పెద్దగా డిమాండ్ ఉండదు ఇండస్ట్రీలో. కానీ ఈ మధ్య కొందరు హీరోయిన్లు మాత్రం లేటు వయసులోనూ అవకాశాలు బాగానే దక్కించుకుంటున్నారు. కాకపోతే ఎప్పుడూ భారీ సినిమాలు.. స్టార్ హీరోల చిత్రాలే కావాలంటే కష్టం. డిమాండ్ కొంచెం తగ్గాక అవసరాలకు తగ్గట్లుగా కెరీర్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది.

కాజల్ అగర్వాల్ ఇలాంటి అడ్జస్ట్‌మెంట్లతోనే ఇంకా కెరీర్‌ను పొడిగించుకుంటోంది. ఆమె ఇటీవల కొంచెం రేంజ్ తగ్గించుకుని చిన్న-మీడియం రేంజి హీరోలతోనూ నటిస్తోంది. గత ఏడాది దగ్గుబాటి రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేసిన కాజల్.. ఈ ఏడాది నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ‘ఎమ్మెల్యే’లో నటించింది. ప్రస్తుతం ఆమె బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి అప్ కమింగ్ హీరోతో సినిమా చేస్తోంది.

ఈ కోవలోనే కాజల్ అగర్వాల్.. యువ కథానాయకుడు శర్వానంద్‌తో కలిసి నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వా నటిస్తున్న ‘పడి పడి లేచె మనసు’లో నటిస్తోందట. ఐతే ఇందులో కాజల్‌ది లీడ్ హీరోయిన్ రోల్ కాదు. ఇందులో సాయిపల్లవి కథానాయిక అన్న సంగతి తెలిసిందే. కాజల్‌ది ఇందులో ప్రత్యేకమైన పాత్ర అట. అది ఆసక్తికరంగా ఉండటంతో కాజల్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె మంచి పారితోషకమే అందుకుంటోందట. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 21న విడుదల కాబోతోంది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన లుక్స్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం చాలా వరకు కలకత్తా నేపథ్యంలో సాగుతుంది. ‘లై’తో ఎదురు దెబ్బ తిన్న హను.. చాలా పట్టుదలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు