‘అన్నపూర్ణ’లో నాగ్ బీర్ కొట్టే ప్లేసేది?

‘అన్నపూర్ణ’లో నాగ్ బీర్ కొట్టే ప్లేసేది?

సెలబ్రెటీలు తమ వ్యసనాల గురించి ఓపెన్‌గా మాట్లాడటం అరుదు. సరదాకి కూడా ఆ సంగతి బయటికి చెప్పరు. కానీ అక్కినేని నాగార్జున మాత్రం ఫన్నీ స్టయిల్లో తాను యుక్త వయసులో ఎలా బీర్ కొట్టేవాడో వెల్లడించాడు. అందుకు తమ అన్నపూర్ణ స్టూడియోసే వేదిక అని నాగ్ చెప్పడం విశేషం. ‘గూఢచారి’ సక్సెస్ మీట్లో భాగంగా నాగ్ ఈ విషయాన్ని వెల్లడించడం విశేషం. ‘గూఢచారి’ టీం అన్నపూర్ణ స్టూడియోలో 17 రోజుల పాటు షూటింగ్ చేసినట్లు తనకు తెలిసిందని.. కానీ సినిమా చూస్తుంటే ఎక్కడా అన్నపూర్ణ లొకేషన్లేవీ తనకు కనిపించలేదని నాగ్ చెప్పాడు. దీంతో వీళ్లు ఎక్కడ షూటింగ్ చేశారబ్బా అనిపించిందని అన్నాడు. 30-40 ఏళ్లుగా అన్నపూర్ణ స్టూడియోలో తిరుగుతూ ఆమూలాగ్రం తెలిసిన తనకు కూడా అందని లొకేషన్లలో వీళ్లు షూటింగ్ ఎలా చేశారో అర్థం కావడం లేదని నాగ్ చెప్పాడు.

తాను యుక్త వయసులో ఉన్నపుడు అమ్మా నాన్నకు తెలియకుండా బీర్ కొట్టడం కోసం స్టూడియోలో అడవిలా ఉండే ఓ ప్రదేశానికి వెళ్లేవాడినని.. అలాంటి లొకేషన్లను ఈ చిత్ర బృందం ఎంచుకుని తనకే స్టూడియోను కొత్తగా పరిచయం చేసిందని నాగ్ చెప్పాడు. ఈ సమయంలో తన తండ్రి ఏఎన్నార్ ఉంటే.. స్టూడియోను ఇంత బాగా వాడుకున్నందుకు చాలా సంతోషించేవాళ్లని నాగ్ చెప్పాడు. అలాగే ‘గూఢచారి’ టీం హిమాచల్ ప్రదేశ్ లోనూ అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేసిందని.. తాము ఎన్నోసార్లు అక్కడికి వెళ్లినా ఇంత అందమైన ప్రదేశాల్ని పట్టుకోలేకపోయామని.. కానీ ఈ చిత్ర బృందం మాత్రం మంచి లొకేషన్లలో షూట్ చేసిందని.. ఇలా సినిమా అంతా కూడా మంచి లొకేషన్లలో తక్కువ బడ్జెట్లో సన్నివేశాలు తీసిన విషయం కనిపించిందని నాగ్ కితాబిచ్చాడు. ఈ సినిమాకు అయిన బడ్జెట్ ఎంతో తెలిసి తాను ఆశ్చర్యపోయానని.. అంత తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఎలా ఇచ్చారో అర్థం కాలేదని అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు