దేవరకొండ.. ఈ క్రేజేంటి బాబోయ్

దేవరకొండ.. ఈ క్రేజేంటి బాబోయ్

'అర్జున్ రెడ్డి' సినిమా వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. ఆ సినిమాతో విజయ్ దేవరకొండకు మంచి క్రేజ్ వచ్చింది కానీ.. ఈ ఏడాది కాలంలో ఇంకో కొత్త సినిమా ఏదీ రిలీజ్ చేయకుండా.. ఇంకో హిట్టు కొట్టకుండా తనకొచ్చిన క్రేజ్‌ను నిలబెట్టుకోవడం అన్నది అంత సులువైన విషయం కాదు. కానీ విజయ్ మాత్రం బయట కూడా తనదైన యాటిట్యూడ్ చూపిస్తూ.. తరచుగా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. నిత్యం వార్తల్లో నిలుస్తూ.. తన ఫాలోయింగ్‌ను నిలుపుకున్నాడు. క్రేజ్ తగ్గకుండా చూసుకున్నాడు.

విజయ్ ఫాలోయింగ్, క్రేజ్ ఏ స్థాయిలో ఉందన్నది అతడి కొత్త సినిమా 'గీత గోవిందం' ప్రోమోలకు వస్తున్న రెస్పాన్స్‌ను బట్టే అర్థమవుతోంది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్.. ఇతర పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచాయి.

ఇక సోమవారం రిలీజైన 'గీత గోవిందం' టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. బడా హీరోల టీజర్లు రిలీజైనపుడు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో దీనికీ అలాంటి స్పందనే కనిపించింది. నిన్నట్నుంచి 'గీత గోవిందం' టీజర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతుండటం విశేషం. 24 గంటల్లోనే యూట్యూబ్‌లో దీని వ్యూస్ 32 లక్షలు దాటాయి. ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌ వ్యూస్ కూడా కలిపితే లెక్క ఇంకా ఎక్కువ ఉంటుంది. 'అర్జున్ రెడ్డి'తో విజయ్‌కు వచ్చిన క్రేజ్‌తో ఇతర భాషల వాళ్లు కూడా  ఈ టీజర్‌ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.

టీజర్ చాలా ఎంటర్టైనింగ్‌గా ఉండటంతో యూత్‌కు విపరీతంగా నచ్చేసింది. ముఖ్యంగా చివర్లో నేను మారిపోయా.. డీసెంట్ అయిపోయా అంటూ విజయ్ చెప్పే డైలాగ్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి అంచనాలుండగా.. టీజర్ తర్వాత అవి మరింత పెరిగిపోయాయి. దీని ఓపెనింగ్స్ అనూహ్యంగా ఉండే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు