దిలీప్ గొడవపై కుండబద్దలు కొట్టేశాడు

దిలీప్ గొడవపై కుండబద్దలు కొట్టేశాడు

దాదాపు ఏడాదిన్నర కిందట ఒక మలయాళ హీరోయిన్ని కిడ్నాప్ చేసి.. ఆమెపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ వ్యవహారం తర్వాత అనేక మలుపులు తిరిగింది. ఆ హీరోయిన్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నాడంటూ మలయాళ స్టార్ హీరో దిలీప్‌ను పోలీసులు అరెస్టు చేయడం.. అతను కొన్ని నెలల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్ మీద బయటికి రావడం.. ముందు అతను ఈ కేసులో పూర్తిగా ఇరుక్కున్నట్లు వార్తలు రాగా.. ఆ తర్వాత ఆ కేసు నీరుగారిపోయేలా కనిపించడం తెలిసిన సంగతే.

కాగా ఆ కేసు సంగతి ఇంకా తేలకుండానే ఇటీవలే మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ)లో అతడి సభ్యత్వాన్ని పునరుద్ధరించడం తీవ్ర దుమారం రేపింది. ‘అమ్మ’ అధ్యక్షుడైన మోహన్ లాల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు ఈ విషయంలో. ఆయన నిర్ణయాన్ని నిరసిస్తూ కొందరు హీరోయిన్లు ‘అమ్మ’కు రాజీనామా కూడా చేశారు.

ఈ వివాదంపై కోలీవుడ్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ స్పందించాడు. ఆయన మోహన్ లాల్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. కేసు సంగతేంటో తేలకుండా దిలీప్ సభ్యత్వాన్ని ఎలా పునరుద్ధరిస్తారని ఆయన అన్నారు. ఈ కేసుకు సంబంధించి సదరు కథానాయికకు అన్యాయం జరిగిందని తాను భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దిలీప్ మీద సానుభూతి చూపించాలనుకుంటే.. అతడికి మద్దతివ్వాలనుకుంటే వ్యక్తిగతంగా చేయొచ్చని.. కానీ ఎంతోమంది సభ్యులున్న ‘అమ్మ’లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని ఆయన అన్నారు.

కమల్ లాంటి పెద్ద నటుడు ఈ విషయంపై తన అభిప్రాయాన్ని ఇంత స్పష్టంగా చెప్పడం మోహన్ లాల్ అండ్ కోకు ఇబ్బంది కలిగించే విషయమే. వ్యక్తిగతంగా లాల్‌కు కమల్ మిత్రుడే అయినా ఈ విషయంలో ఆయన మొహమాటం లేకుండా విమర్శలు గుప్పించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English