నందమూరి టైటిళ్లపై పడ్డాడే..

నందమూరి టైటిళ్లపై పడ్డాడే..

ఈ ఏడాది ఆరంభంలో ‘ఛలో’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నాగశౌర్యకు.. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. డబ్బింగ్ సినిమా ‘కణం’తో పాటు తెలుగులో నటించిన ‘అమ్మమ్మగారిల్లు’ అతడికి నిరాశ కలిగించాయి. ఐతే వాటి గురించి మరిచిపోయి కొత్తగా మొదలుపెట్టిన రెండు సినిమాలపై ఆశలు పెట్టుకున్నాడు శౌర్య. ‘ఛలో’ తీసిన సొంత బేనర్లో ఒక సినిమా.. ‘భవ్య క్రియేషన్స్’ లాంటి పెద్ద సంస్థలో మరో సినిమా శౌర్య చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాలకు నందమూరి హీరోల పాత క్లాసిక్స్ పేర్లను శౌర్య పెట్టుకోవడం విశేషం. సొంత బేనర్లో శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో శౌర్య చేస్తున్న సినిమా ‘నర్తన శాల’ అనే టైటిల్ ఖరారైన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోయిన చిత్రమది. అందులో ఆయన బృహన్నలగా అద్భుత అభినయం కనబరిచాడు. శౌర్య కూడా మోడర్న్ ‘నర్తనశాల’లో బృహన్నల తరహా పాత్రనే చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు రాజా కొలుసు అనే కొత్త దర్శకుడితో ‘భవ్య’లో చేస్తున్న సినిమాకు ‘నారి నారి నడుమ మురారి’ అనే టైటిల్ పెట్టుకున్నాడట శౌర్య. ఇది ఇద్దరు భామల మధ్య నలిగిపోయే కుర్రాడి కథ అట. అందుకే ఆ టైటిల్ పెట్టారట. ‘నారి నారి నడుమ మురారి’ పేరుతో బాలయ్య ఓ సూపర్ హిట్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇలా నందమూరి తండ్రీ కొడుకుల సినిమాల పేర్లతో పలకరించబోయే శౌర్య ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి. ఇది కాక శౌర్యకు ఇంకో కమిట్మెంట్ కూడా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు