మైనస్ నుంచి జీరోకి వచ్చాడు

మైనస్ నుంచి జీరోకి వచ్చాడు

సినీ రంగంలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన అందరూ హీరోలుగా నిలదొక్కుకుంటారనేమీ లేదు. పెద్ద బ్యాకప్‌తో హీరోలుగా మారిన చాలామంది ఇక్కడ స్ట్రగులవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా సరైన విజయాల్లేక.. ఫాలోయింగ్ రాక ఇబ్బంది పడుతున్నారు. అందులో మహేష్ బావ సుధీర్ బాబు కూడా ఒకడు. మామూలుగా హీరోలు.. దర్శకులు.. నిర్మాతల కొడుకులే హీరోలవుతుంటారు.

కానీ ఒక హీరో అల్లుడు హీరో కావడం అన్నది అరుదైన విషయం. దీనికి సుధీర్ బాబే శ్రీకారం చుట్టాడు. కానీ ఆరేడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా అతను ఆశించిన గుర్తింపు.. విజయాలు దక్కలేదు. ‘ప్రేమకథా చిత్రమ్’ మాత్రమే అతడి కెరీర్లో నిఖార్సయిన హిట్టు. కానీ దాని వల్ల అతడికేమీ పేరు రాలేదు. ఇలాంటి తరుణంలో ‘సమ్మోహనం’ వచ్చి సుధీర్ బాబు కెరీర్లో అత్యావశక్యమైన ఫలితాన్నందించింది.

‘సమ్మోహనం’ ఇటు విమర్శకుల ప్రశంసలందుకోవడంతో పాటు అటు కమర్షియల్‌గానూ మంచి ఫలితాన్నందుకునే దిశగా సాగుతోంది. ఈ చిత్రంలో సుధీర్ నటన కూడా ఆకట్టుకుంది. ఇప్పటికే తొమ్మిది సినిమాలు చేసిన సుధీర్.. నటుడిగా అంత బలమైన ముద్ర వేసింది లేదు. అతడి లుక్స్ ఏమంత గొప్పగా ఉండవు. పైగా వాయిస్ పెద్ద మైనస్. దీంతో అతడి మీద జనాల్లో ఒక నెగెటివ్ ఇంపాక్ట్ పడిపోయింది. పైగా సినిమాల ఎంపికలో తప్పిదాలు కూడా తోడై తిరోగమన దిశలోనే ప్రయత్నించాడు సుధీర్. ఇలాంటి సమయంలో ‘సమ్మోహనం’ అతడికి గొప్ప ఉపశమనాన్నిచ్చింది. నటీనటుల నుంచి మంచి పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో దిట్ట అయిన ఇంద్రగంటి మోహనకృష్ణ.. సుధీర్ బాబులోని మైనస్‌లన్నీ కవర్ చేస్తూ చక్కగా ప్రెజెంట్ చేశాడు.

సటిల్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సిన పాత్ర కావడంతో అతడి బలహీనతలు బయటపడలేదు. ముఖ్యంగా సినిమా అంతటా లో వాయిస్ మెయింటైన్ చేయడం ద్వారా ఎక్కడా ఎబ్బెట్టుగా లేకుండా చూసుకున్నాడు. మొత్తంగా ‘సమ్మోహనం’ సుధీర్‌కు అన్ని రకాలుగా కలిసొచ్చింది. ఇన్నాళ్లూ మైనస్‌లోనే ఉన్న అతను.. తొలిసారిగా జీరో మార్కు దాటి ప్లస్‌లోకి అడుగుపెట్టాడు. దీని మీద కెరీర్‌‌ను ఎలా బిల్డ్ చేసుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు