పెట్టుబడిలో సగం కూడా రాలేదే..

పెట్టుబడిలో సగం కూడా రాలేదే..

మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ‘నేల టిక్కెట్టు’ భవితవ్యమేంటో తొలి రోజు తొలి షోతోనే తేలిపోయింది. ఈ సినిమాకు దారుణమైన టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా అందుకు తగ్గట్లే వచ్చాయి. మామూలుగా రవితేజ సినిమాలకు వచ్చేదాంతో సగం మాత్రమే వసూళ్లు వచ్చాయి తొలి రోజు. ఆ తర్వాత వసూళ్లు మరింత పడిపోయాయి.

వారం తిరక్కుండానే సినిమా థియేటర్ల నుంచి లేచిపోయే పరిస్థితి నెలకొంది. కానీ చిత్ర బృందం మాత్రం ఇది ‘జనం మెచ్చిన సినిమా’ అంటూ ప్రచారం చేసుకుంది. కానీ చివరికి చూస్తే ‘నేల టిక్కెట్టు’ వసూలు చేసి మొత్తం చూసి షాకయ్యే పరిస్థితి. రూ.10 కోట్ల షేర్ కూడా తేలేదీ చిత్రం. తొమ్మిదిన్నర కోట్లతో థియేట్రికల్ రన్ ముగిసిపోయింది. డిజాస్టర్‌గా నిలిచిన రవితేజ గత సినిమా ‘టచ్ చేసి చూడు’ కూడా దీనికంటే మెరుగ్గానే పెర్ఫామ్ చేసింది.

‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి బ్లాక్ బస్టర్, ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి సూపర్ హిట్ తీసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. మాస్ రాజా కలిసి చేసిన సినిమాకు ఇలాంటి ఫలితం వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ‘నేల టిక్కెట్టు’ నిర్మాత అయిన పవన్ కళ్యాణ్ మిత్రుడు రామ్ తాళ్ళూరి ఈ చిత్రానికి బాగా  బిజినెస్ చేసుకున్నాడు. రూ.22 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మాడు. కానీ అందులో సగం కూడా బయ్యర్ల ఖాతాలోకి చేరలేదు. ప్రతి ఏరియాలోనూ బయ్యర్లు సగానికి పైగా పెట్టుబడి నష్టపోయారు. మరి వాళ్లకు నిర్మాత ఏమైనా సెటిల్ చేస్తాడేమో చూడాలి.
వరుసగా రెండు పెద్ద డిజాస్టర్లు ఎదురుకావడంతో రవితేజ మార్కెట్ బాగా దెబ్బ తినేసినట్లే. ఈ ప్రభావం శ్రీను వైట్లతో అతను చేస్తున్న సినిమాపై తప్పక ఉంటుందని భావిస్తున్నారు. వైట్ల సైతం వరుస డిజాస్టర్లలో ఉన్న నేపథ్యంలో ఆ సినిమాను సేల్ చేయడం మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు అంత ఈజీ కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు