ఇళయరాజాకు బాలు డబ్బులిస్తున్నాడట

ఇళయరాజాకు బాలు డబ్బులిస్తున్నాడట

ఎస్పీ బాలసుబ్రమణ్యం.. ఇళయరాజా.. ఇద్దరూ దిగ్గజాలే. ఎవరికి ఎవరూ తీసిపోరు. ఇద్దరి ఎదుగుదలలో పరస్పర ప్రమేయం ఉంది. బాలు పాట ఇళయరాజాను ఎన్నో మెట్లు ఎక్కిస్తే.. రాజా సంగీతం బాలు స్థాయిని ఎంతో పెంచింది. ఇద్దరూ నాలుగు దశాబ్దాలుగా కలిసి తమ స్వర ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఇద్దరికీ వ్యక్తిగతంగా కూడా గొప్ప అనుబంధం ఉంది. పరస్పరం ఒరేయ్ అని పిలుచుకునే స్నేహం ఉంది వాళ్ల మధ్య. అలాంటి వాళ్ల మధ్య అనుకోని వివాదం అంతరాన్ని పెంచింది. తన పాటలతో కచేరీ నిర్వహిస్తున్నందుకు తనకు రాయల్టీ చెల్లించాలంటూ ఇళయరాజా బాలుకు నోటీసులివ్వడం పెద్ద దుమారమే రేపింది.

ఇళయరాజా రాయల్టీ అడగడంలో తప్పు లేదు కానీ.. తమ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తించకుండా ఇలా నోటీసులివ్వడమేంటి అన్నది బాలు బాధ. ఈ విషయంలో ఆయనెంత హర్టయ్యాడో ఇంతకుముందే చెప్పాడు. ఈ వివాదం గురించి ఇళయరాజా తర్వాత ఎక్కడా మాట్లాడటానికి ఇష్టపడలేదు. తాను తప్పు చేశానన్న భావన ఆయనలో ఉందని సన్నిహితులు చెబుతారు. మధ్యలో బాలు-రాజా మధ్య ఏం జరిగిందో తెలియదు. సన్నిహితులు రాజీ కుదిర్చారని అంటారు.

అదలా ఉంటే ఆదివారం బాలు తన పుట్టిన రోజు సందర్భంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇళయరాజాతో తన గొడవ గురించి స్పందించారు. కచేరీల్లో ఇళయరాజా పాటలు ఇప్పటికీ పాడుతున్నట్లు చెప్పారు. కానీ ఊరికే ఆ పాటలు వాడుకోవట్లేదన్నారు. ఇళయరాజాకు వెళ్లాల్సింది వెళ్తోందని అన్నారు. ఐతే రాజా తీరుతో తాను మనస్తాపం చెందిన విషయాన్ని ఆయన అంగీకరించారు. దీని గురించి అంతకుమించి మాట్లాడటానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. తన పాటలకు రాయల్టీ తీసుకోవాలని రాజా ఆశించడం కరెక్టే కానీ.. ఆయన బాలుతో వ్యవహరించిన తీరు మాత్రం నిజంగా ఆక్షేపణీయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English