వర్మపై మరీ ఇంత కోపముందా?

వర్మపై మరీ ఇంత కోపముందా?

అక్కినేని నాగార్జున-రామ్ గోపాల్ వర్మలది మామూలు కాంబినేషన్ కాదు.తెలుగు సినిమా గతినే మార్చిన 'శివ' లాంటి సినిమాను అందించిందీ జోడీ. ఆ తర్వాత వీళ్ల కలయికలో వచ్చిన 'గోవిందా గోవిందా'.. 'అంతం' ఆఢించిన స్థాయిలో ఆడి ఉండకపోవచ్చు. కానీ అవి కూడా తీసిపడేయదగ్గ సినిమాలు కావు. ఐతే గత దశాబ్ద కాలంలో చెత్త చెత్త సినిమాలు తీసి వర్మ తనకున్న పేరంతా పోగొట్టుకున్నప్పటికీ.. మళ్లీ నాగార్జునతో సినిమా అనేసరికి ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో అన్న ఒక ఆసక్తి ఉండేది. కానీ 'ఆఫీసర్' టీజర్లు, ట్రైలర్ చూస్తే మాత్రం ఒక్కసారిగా నాగ్ అభిమానులు నిట్టూర్చేశారు. సినిమాపై అంచనాలే లేకుండా చేశాయి ప్రోమోలు. ఈ ప్రతికూలతలు చాలదన్నట్లు గత కొన్ని నెలల్లో జరిగిన పరిణామాల కారణంగా వర్మ మీద నెలకొన్న తాలూకు ప్రభావమంతా 'ఆఫీసర్' మీదికి మళ్లింది.

ఐతే వర్మ మీద పవన్, మెగా ఫ్యామిలీ  అభిమానులు మాత్రమే వ్యతిరేకతతో ఉంటారని.. మిగతా జనాలు ఈ సినిమాను ఆదరిస్తారని అనుకున్నారు. కానీ 'ఆఫీసర్'కు వచ్చిన వసూళ్లు చూస్తుంటే దీనిపై ఈ సినిమాపై మరీ ఈ స్థాయిలో వ్యతిరేకత ఉందా అనిపిస్తోంది. నాగార్జున లాంటి స్టార్ ఉన్న సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 60 లక్షల షేర్ కూడా రాలేదంటే ఏమనాలి? సరైన సినిమా పడితే పది కోట్ల షేర్ రాబట్టే రేంజ్ నాగార్జునది. అలాంటి హీరో సినిమాకు ఈ వసూళ్లేంటని ఇండస్ట్రీ అంతా విస్తుబోతోంది. దర్శకుడిగా, వ్యక్తిగా పతనం అయిన వర్మపై జనాల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత వచ్చేసిందో ఈ సినిమా వసూళ్లే రుజువుగా నిలుస్తున్నాయి. ఆ నెగెటివిటీని నాగార్జున ఏమాత్రం తగ్గించలేకపోయాడు. పైగా అందులో పడి తనూ కొట్టుకుపోయాడు. నాగ్ ముఖం చూసి కూడా ఈ సినిమాకు జనాలు రావట్లేదని తొలి రోజు వసూళ్లతో తేలిపోయింది. తొలి రోజే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మున్ముందు ఎలా ఉంటుందో చెప్పేదేముంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు