సామి స్క్వేర్.. ఊర ఊర మాస్

సామి స్క్వేర్.. ఊర ఊర మాస్

పోలీస్ సినిమాలు తీయడంలో తమిళ దర్శకుడు హరి స్టయిలే వేరు. ఆయన కెరీర్లో సగం సినిమాలు ఖాకీ నేపథ్యంలో సాగేవే. ‘సూర్య’తో వరుసగా సింగం సిరీస్‌లో హరి మూడు సినిమాలు తీసిన సంగతి తెలిసిందే. నిజానికి నాలుగో ‘సింగం’కు కుడా కథ రెడీ చేసుకున్నాడు హరి. కానీ మూడో ‘సింగం’ ఆడకపోవడంతో ఆ ఫ్రాంఛైజీకి బ్రేక్ పడిపోయింది. అలాగని అతను పోలీస్ కథ నుంచి పక్కకు వెళ్లలేదు.

దాదాపు దశాబ్దంన్నర కిందట అతను తీసిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సామి’కి సీక్వెల్ తీస్తున్నాడు. తెలుగులో ‘లక్ష్మీనరసింహా’ పేరుతో రీమేక్ అయిన ‘సామి’ అప్పట్లో పోలీస్ కథల్లో ట్రెండ్ సెట్టర్ అయింది. తమిళంలో ఆ సమయానికి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. విక్రమ్ నటించిన ఈ చిత్రానికి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ చేస్తున్నాడు హరి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తాజాగా రిలీజ్ చేశాడు.

అది చూస్తే మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ రావడం ఖాయం. రోడ్డు పక్కన ఇండికేటర్ రాయి మీద కూర్చుని ‘సామి’ పాత్రను గుర్తుకు తెచ్చే విక్రమ్ రూపాన్ని తనదైన శైలిలో ప్రెజెంట్ చేశాడు హరి. ఆ పాత్రకు సంబంధించిన చేతులు విరుచుకునే మేనరిజం ఈ మోషన్ పోస్టర్‌కు హైలైట్. స్పెషల్ ఎఫెక్టులతో ఒక టీజర్ స్టయిల్లో ఈ పోస్టర్ లాంచ్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మాస్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేలా ఉంది. ఈ చిత్రానికి ‘సామి-2’ అని కాకుండా ‘సామి స్క్వేర్’ అని టైటిల్ పెట్టడం  విశేషం. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్‌కు ఆ స్థాయి విజయం దక్కలేదు.

ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి ఫెయిలయ్యాడు. అతడికి మంచి కమర్షియల్ హిట్ చాలా అవసరం. అది ‘సామి స్క్వేర్’ తీర్చేలా కనిపిస్తోంది. విక్రమ్‌ను మళ్లీ సామి పాత్రలో చూడటం అతడి అభిమానులకు మహదానందాన్నిచ్చేదే. మరి ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తారా.. లేక రీమేక్ చేస్తారా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు