బాహుబలి-2.. బాహుబలి-1కు పది రెట్లు

బాహుబలి-2.. బాహుబలి-1కు పది రెట్లు

‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అదరగొట్టింది. భారీ వసూళ్లు సాధించింది. కానీ ఆ చిత్రానికి చైనాలో మాత్రం చుక్కెదురైంది. రెండేళ్ల కిందట ఎంతో హడావుడి చేసి పెద్ద ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు చైనాలో. కానీ అక్కడ ఆ సినిమా ఏమాత్రం ప్రభావం చూపలేకోయింది. రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాలేదు. ఫుల్ రన్లో ఆ చిత్రం మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసినట్లు వార్తలొచ్చాయి అప్పట్లో.

ఈ నేపథ్యంలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ మాత్రం చైనాలో ఏమాత్రం ప్రభావం చూపుతుందా అని అందరూ సందేహించారు. మళ్లీ దీని కోసం ప్రయాస పడటం ఎందుకని కూడా పెదవి విరిచారు. కానీ అంచనాలకు భిన్నంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’ చైనాలో అదరగొట్టింది.

మే 4న చైనాలో రిలీజైన ‘బాహుబలి-2’ తొలి రోజే 2.5 మిలియన్ డాలర్లు వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత పడుతూ లేస్తూ సాగిన ఈ చిత్రం ఇప్పుడు 10 మిలియన్ మార్కును కూడా టచ్ చేసింది. అంటే రూపాయల్లో చెప్పాలంటే దాదాపు 66 కోట్లన్నమాట. ‘బాహుబలి-1’తో పోలిస్తే ఇది పది రెట్లు ఎక్కువగా వసూళ్లు రాబట్టింది. ఐతే ‘ది బిగినింగ్’తో పోలిస్తే ఈ వసూళ్లు బాగా అనిపించొచ్చు కానీ.. ‘బాహుబలి’ మిగతా చోట్ల ఆడిందాంతో పోలిస్తే ఇది చిన్న విషయమే. అమెరికాలో ఆ చిత్రం ఏకంగా రూ.120 కోట్లు కొల్లగొట్టడం విశేషం.

గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ‘ది కంక్లూజన్’ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల ప్రభంజనం సాగిస్తూ ఏకంగా రూ.1750 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. నాలుగు నెలల కిందటే ఈ చిత్రం జపాన్‌లో విడుదలై మంచి కలెక్షన్లే సాధించింది. అవి.. చైనా వసూళ్లు కలిపితే లెక్క రూ.1850 కోట్ల దాకా ఉండొచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు