స్నేహ గురించి ఇంట్లో బన్నీ ఎలా చెప్పాడంటే..

స్నేహ గురించి ఇంట్లో బన్నీ ఎలా చెప్పాడంటే..

సినీ పరిశ్రమలో కులాంతర వివాహాలు కొత్త కాదు. ఈ మధ్య ఆ ధోరణి బాగా పెరుగుతోంది. టాలీవుడ్ బడా ఫ్యామిలీలన్నింట్లో ఇంటర్ క్యాస్ట్ మారేజెస్ చూడొచ్చు. ఈ కోవలోనిదే అల్లు అర్జున్-స్నేహారెడ్డిల పెళ్లి కూడా. తన స్నేహితురాలైన స్నేహను ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు బన్నీ. మరి ఆ ఒప్పించే క్రమంలో బన్నీ వాళ్లకు ఏం చెప్పాడు.. స్నేహ గురించి ఎలా పరిచయం చేశాడు అన్నది ఆసక్తికరం. ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాలు వెల్లడించాడు బన్నీ. స్నేహ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పడం.. వాళ్లు ఒప్పకోవడం.. ఆమెతో పెళ్లి.. ఆ తర్వాత తమ కుటుంబంలో ఆమె ఎలా కలిసిపోవడం గురించి బన్నీ ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

‘స్నేహ అని నా ఫ్రెండ్‌. చాలా మంచి అమ్మాయి. వాళ్లు రెడ్డీస్‌. మీకేమైనా అభ్యంతరమా?’ అని సూటిగా అడిగేశాడట బన్నీ తన తల్లిదండ్రుల్ని. దీనికి బదులుగా ‘మేం చూసి చేసినా.. నీ అంతట నువ్వు ఎంపిక చేసుకున్నా, నువ్వు సంతోషంగా ఉండటమే ముఖ్యం. అభ్యంతరం లేదు’ అని వాళ్లు చెప్పారట. తన తల్లి మొదట్నుంచి మోడ్రన్‌. అంటే మోడ్రన్‌ బట్టలు వేసుకోవటం.. ఇంగ్లీష్‌ మాట్లాడటం కాదని.. ఆలోచన విధానంలో చాలా ముందుంటారని.. అందుకే తన పెళ్లి విషయంలో ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదని బన్నీ అన్నాడు.

కులాంతర వివాహాల విషయంలో పాత తరంలోనూ పెద్దగా పట్టించుకోని వాళ్లున్నారని.. ఇప్పటి తరంలో పట్టించుకుంటున్న వాళ్లు ఉన్నారని.. ఏదో ఒక జనరేషన్ మీద నింద వేయడం సరికాదని బన్నీ అన్నాడు. తన భార్య స్నేహ తమ కుటుంబంలో బాగా కలిసిపోయిందని.. ఇన్నేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన భార్యకు.. తల్లికి ఏ విషయంలోనూ విభేదాలు రాలేదని.. దాన్ని బట్టే వాళ్లిద్దరూ ఎంత బాగా ఫ్యామిలీని డీల్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని.. ఇది తనకెంతో సంతోషాన్నిచ్చే విషయమని బన్నీ అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు