పోస్టర్ బాగానే ఉంది కానీ..

పోస్టర్ బాగానే ఉంది కానీ..

టాలీవుడ్లో ప్రస్తుత హీరోల జాబితా తీస్తే అందులో 70-80 శాతం మంది వారసులే కనిపిస్తారేమో. గత దశాబ్ద కాలంలో అయితే ఇబ్బడి ముబ్బడిగా వారసులు తెరంగేట్రం చేశారు. అందులో కొందరు సక్సెస్ అయ్యారు. కొందరు ఫెయిలయ్యారు. కానీ ఫెయిలైన వాళ్లు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపోవట్లేదు. ఏదో ఒక దశలో దశ తిరగకపోదా అని పోరాడుతూనే ఉన్నారు. ఆ జాబితాలోని హీరో సుశాంత్. అక్కినేని నాగార్జున మేనల్లుడిగా ఇతడికి మంచి బ్యాకప్పే దొరికింది. సొంత బేనర్లో వరుస బెట్టి సినిమాలు చేశాడు. కానీ ఒక్కటీ ఆడలేదు. చివరగా సుశాంత్ చేసిన ‘ఆటాడుకుందాం రా’ దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో ఈసారి బాగా గ్యాప్ తీసుకుని ‘చి ల సౌ’ అనే చిత్రంలో నటించాడు.

సుశాంత్ తొలిసారి బయటి బేనర్లో చేసిన చిత్రమిది. నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. సుశాంత్ ఈ పోస్టర్లో అందంగానే కనిపిస్తున్నాడు. పెళ్లి కోసం సమాజం ఎలా తొందరపెడుతుందో ఈ పోస్టర్లో చూపించారు? అన్నీ దానికి సంబంధించిన ప్రశ్నలే కనిపిస్తున్నాయి పోస్టర్లో. దీన్ని బట్టి పెళ్లీడుకొచ్చి అందరితోనూ పెళ్లి కోసం ఒత్తిడి ఎదుర్కొనే కుర్రాడి కథ ఇది అనుకోవచ్చు. ఈ పోస్టర్ అయితే ఆకర్షణీయంగానే అనిపిస్తోంది కానీ.. సినిమాలో ఏమాత్రం విషయం ఉంటుందో చూడాలి.

ఇప్పటిదాకా సుశాంత్ ఏ రకంగానూ ఇంప్రెస్ చేయలేకపోయాడు. వరుస ఫ్లాపుల వల్ల జనాల్లో సుశాంత్ పట్ల ఒక వ్యతిరేకత ఏర్పడిపోయింది. రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా ఏదో చేస్తాడన్న అంచనాలూ లేవు. మరి ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో రుహాని అనే కొత్తమ్మాయి కథానాయికగా నటిస్తోంది. జశ్వంత్ నడిపల్లి నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. ప్రశాంత్ విహారి సంగీతాన్నందిస్తున్నాడు. ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లేతో పాటు మాటలు కూడా రాహుల్ రవీంద్రనే సమకూర్చుకోవడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు