జై సింహా శతదినోత్సవమట..

జై సింహా శతదినోత్సవమట..

శత దినోత్సవాలు.. రజతోత్సవాల రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడంతా కలెక్షన్ల లెక్కల్ని బట్టే వేడుకలు జరుగుతున్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత మంచి టాక్ వచ్చినా రెండు మూడు వారాలకు మించి నిలబడే పరిస్థితి లేదు. ఇలాంటి రోజుల్లో శతదినోత్సవం అంటే కామెడీగానే ఉంటుంది. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం అదేమీ పట్టించుకునేలా లేడు.

సంక్రాంతికి విడుదలైన తన సినిమా ‘జై సింహా’ శతదినోత్సవ వేడుకలకు ఆయన రెడీ అయిపోతున్నాడు. ఈ నెల 21న ‘జై సింహా’ వంద రోజుల ప్రదర్శన పూర్తి కాబోతోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లోని రెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంటుండటం విశేషం.

బాలయ్య సినిమాల్ని ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు ఆడించేసే ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా)తో పాటు గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో కూడా ఈ చిత్రం వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకోబోతోంది. ఐతే ఈ చిత్రం ఇన్ని రోజులు ఎలా ఆడుతోందో జనాలకు తెలియక ఏమీ కాదు. అయినప్పటికీ ఈ సినిమా జెన్యూన్‌గా ఆడేస్తున్నట్లుగా ఫీలై.. శత దినోత్సవం కూడా జరిపేయబోతున్నాడు నిర్మాత సి.కళ్యాణ్.

త్వరలోనే చిలకలూరి పేటలో శత దినోత్సవం చేయబోతున్నారట. బాలయ్యతో పాటు దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఇతర యూనిట్ సభ్యులు ఆ వేడుకకు హాజరవుతారట. ఇంతకుముందు బాలయ్య ‘లెజెండ్’ మూవీ ఎమ్మిగనూరులోనే 500 రోజులకు పైగా ఆడింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏకంగా 1000 రోజులకు పైగా సినిమాను ఆడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు