‘మహానటి’లో చైతూ గురించి చెప్పారు కానీ..

‘మహానటి’లో చైతూ గురించి చెప్పారు కానీ..

మొత్తానికి ఒక విషయం రూఢి అయింది. అక్కినేని నాగచైతన్య తన తాత అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించబోతున్నాడు. ‘మహానటి’ కోసం అతను ఏఎన్నార్ అవతారం ఎత్తాడు. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అప్పటి ఆమె సహ నటీనటులు, సాంకేతిక నిపుణులకు పాత్రలున్నాయి. సావిత్రితో ఎన్టీఆర్, ఏఎన్నార్ చాలా సినిమాలే చేశారు.

ఎన్టీఆర్ పాత్రను జూనియర్ ఎన్టీఆర్‌తో, ఏఎన్నార్ పాత్రను నాగచైతన్యతో చేయించాలని చిత్ర బృందం భావించింది. కానీ తారక్ తాత పాత్ర చేయడానికి అంగీకరించలేదు. అశ్వినీదత్ అడిగినా ఫలితం లేకపోయింది. ఐతే చైతూ మాత్రం ఏఎన్నార్ పాత్ర చేయడానికి అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై ఇప్పుడు అధికారిక సమాచారం కూడా వచ్చింది.

నిన్ననే ‘మహానటి’ షూటింగ్ ముగించారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ప్రియాంక దత్ మీడియాతో మాట్లాడింది. ఏఎన్నార్ పాత్రలో చేసిన నాగచైతన్యకు కృతజ్ఞతలు చెప్పింది. కానీ ఆమె ఎన్టీఆర్ పాత్ర సంగతేంటో మాత్రం చెప్పలేదు. ఆ పాత్రను వేరే ఎవరైనా నటుడితో చేయించారా.. లేక ప్రచారంలో ఉన్నట్లే డిజిటల్ రూపంలో ఎన్టీఆర్‌ను చూపించబోతున్నారా అన్నదానిపై స్పష్టత లేదు.

ఇక ఈ సినిమా గురించి ప్రియాంక చెబుతూ.. ‘‘మా టెక్నికల్ టీం ఎంతో నేర్పుతో సృష్టించిన బ్లాక్ అండ్ వైట్ శకం ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అద్భుతమైన సినిమాటిక్ అనుభూతినిస్తుంది. ఏ విషయంలోనూ రాజీ పడకుండా ‘మహానటి’ లాంటి అద్భుతమైన సినిమాను రూపొందించినందుకు గర్విస్తున్నాం’’ అని చెప్పింది. ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు