తమిళంలోనూ చేద్దామన్నందుకు తప్పించేశారట

తమిళంలోనూ చేద్దామన్నందుకు తప్పించేశారట

నిఖిల్ కొత్త సినిమా ‘కిరాక్ పార్టీ’ ఇంకో మూడు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంతో శరణ్ కొప్పిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ చిత్రానికి ముందు శరణ్‌ను దర్శకుడిగా అనుకోలేదు. అతను దీనికి రచయిత మాత్రమే. తమిళ స్టార్ డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం ఈ సినిమాను తీయాల్సింది. ఇంతకుముందే అజిత్ హీరోగా ఒక సినిమా తీసిన రాజు.. చాలా విరామం తర్వాత ‘కిరాక్ పార్టీ’తో మళ్లీ మెగా ఫోన్ పట్టాలనుకున్నాడు. స్క్రిప్ట్ డిష్కషన్లలోనూ అతను పాల్గొన్నాడు. అతడి దర్శకత్వంలో సినిమా ఇక సెట్స్ మీదికి వెళ్లడమే ఆలస్యం అనుకుంటుండగా.. ట్విస్ట్ ఇచ్చాడు నిర్మాత అనిల్ సుంకర.

రాజు సుందరంను తప్పించి చిత్ర రచయిత శరణ్ కొప్పిశెట్టికే దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. ఇందుకు కారణమేంటన్నది ఇన్ని రోజులు తెలియలేదు. ఇప్పుడీ విషయమై క్లారిటీ ఇచ్చాడు అనిల్. రాజుతోనే సినిమా తీద్దామనుకున్న మాట వాస్తవమే అని.. ఐతే అతను ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలోనూ ఒకేసారి చేద్దామని పట్టుబట్టాడని.. ఆ విషయంలో ఏకీభవించలేకే రాజును పక్కన పెట్టామని అనిల్ చెప్పాడు. ఐతే రెండు భాషల్లో చేయాలని పట్టుబట్టి ఈ సినిమా చేసే అవకాశాన్ని రాజు వదులుకుని ఉంటాడా అన్నది సందేహం. రాజుతో అనిల్‌కు చాన్నాళ్ల నుంచే మంచి పరిచయం ఉంది. ఆయన బేనర్లో ‘దూకుడు’ సహా పలు సినిమాలకు నృత్య దర్శకుడిగా పని చేయడంతో పాటు అనిల్ దర్శకత్వంలో రూపొందిన ‘యాక్షన్ 3డి’లో ఓ కీలక పాత్ర పోషించాడు రాజు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు